Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో పెత్తనమంతా ఆ నలుగురిదే: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Advertiesment
uttam kumar reddy
, సోమవారం, 9 మార్చి 2015 (11:02 IST)
‘కెప్టెన్‌’గా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే అధికార టీఆర్‌ఎస్‌పై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శల ఫిరంగులను ఎక్కుపెట్టారు. ఆరోపణల శతఘ్నులతో దాడి చేశారు. కులం, కుటుంబమే కేసీఆర్‌ ఎజెండా అని, అధికార పెత్తనమంతా ఆయనది, ఆయన కుమార్తె, కుమారుడు, మేనల్లుడిదేనని విరుచుకుపడ్డారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో అధికార పెత్తనమంతా కేసీఆర్‌, ఆయన కొడుకు, కూతురు, అల్లుడిదే అని టీ పీసీసీ కొత్త చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ జనాభాలో అర శాతం కూడా లేని కులం వారే 40 శాతం మంత్రి పదవులను అనుభవిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన ఆదివారం టీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఎన్ని ధర్నాలు చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ వచ్చేది కాదనీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టిసారించడం వల్లే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందన్నారు. కానీ, అలాంటి తెలంగాణలో కాంగ్రెస్‌ను నాశనం చేయాలని, క్షేత్రస్థాయిలో దెబ్బ తీయాలని టీఆర్‌ఎస్‌ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ‘మన పార్టీ వాళ్లను వేధిస్తూ, బెదిరిస్తూ, హింసిస్తూ, డబ్బులిస్తూ, ప్రలోభ పెడుతూ పార్టీలో చేర్చుకుంటోంది. చివరకు జడ్పీటీసీ, ఎంపీటీసీలనూ వదలకుండా చేర్చుకుంటోంది. సీఎం హోదాలో ఉండి కేసీఆర్‌ నిస్సిగ్గుగా వలసలను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నవాళ్లలో అత్యధికులు ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లేనని, వాళ్లంతా తెలంగాణ వద్దన్నవాళ్లేనని, ఇప్పుడు వారే ప్రభుత్వంలో కీలక శాఖల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్న తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని రెండు కోట్ల మంది మహిళల్లో మంత్రి పదవి చేపట్టడానికి ఒక్కరు కూడా సమర్థురాలు దొరకలేదా అని నిలదీశారు. రాష్ట్రంలో 15 శాతం వరకూ ఉన్న ఎస్సీల్లోని మదిగ, మాల కులస్తుల్లో ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదని తప్పుబట్టారు.
 
కేసీఆర్‌ది మోసపూరిత పాలన అని ఉత్తమ్‌ విమర్శించారు. ‘దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామన్నాడు. రాష్ట్రంలో 50-60 లక్షల మంది దళితులు ఉంటే కేవలం 45 మందికే గోల్కొండ కోటలో పట్టాలు ఇచ్చాడు. గిరిజన ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు గిరిజనులకు కూడా మూడెకరాల భూమి ఇస్తామన్నాడు. కానీ.. ఆ ఊసే లేదు. ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామన్నాడు. గవర్నర్‌ ప్రసంగంలో మాత్రం జనాభా ఆధారంగా గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పించారు. అంటే, గిరిజనులకు 9.3 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారా? ఇది మోసం కాదా!? అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu