తమిళనాడు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే పీకే శేఖర్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర చెన్నైలోని ఉత్తరాది వారు డీఎంకే పుణ్యమాని ధనవంతులు అయ్యారనీ, ఓట్లు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేశారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది.
ఇదే అంశంపై పీకే శేఖర్ బాబు మాట్లాడుతూ, ఉత్తరాది వారు తమిళనాడులో జీవిస్తూ, ధనవంతులుగా మారారని, దానికి కారణం డీఎంకే అని వ్యాఖ్యానించారు. కానీ, వారు బీజేపీకి ఓటు వేశారని మండిపడ్డారు. ఈవీఎంల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని, కానీ ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవచ్చని బెదిరించారు.
'ఉత్తరాది వారు ధనవంతులు కావడం నేను చూశాను. బీజేపీ వల్లేమీ కాదు. డీఎంకే వల్లే అయ్యారు. అయినా, మీరు మాకు ఓటు వేయలేదు. బీజేపీ వారికే వేశారు. అయినా మీరు మాకే ఓటు వేశారని అంటారు. మోసం చేస్తున్నారు' అని శేఖర్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.