తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరపున ప్రచారానికి వెళ్ళిన నటుడు మనోబాలాకు ఓటర్ల నుంచి ఊహించని సంఘటన ఒకటి ఎదురైంది. తమిళనాడులోని ఆర్కేనగర్‌లో అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత తరపున ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయనపై ఆగ్రహం చెందిన ప్రజలు ఆయనపై చెప్పులు విసిరారు.
చెన్నై నగరంలోని వాషర్‌మెన్ పేటలో మనోబాలా ప్రచారం చేస్తుండగా అతనిపై ఒక భవనం నుండి చెప్పులు పడ్డాయి. ఈ నియోజక వర్గం నుండి అన్నాడీఎంకే చీఫ్ జయలలిత పోటీ చేస్తున్న ఈ సెగ్మెంట్‌లో ఈ తరహా సంఘటన ఎదురుకావడంతో అన్నాడీఎంకే శ్రేణులు సైతం షాక్‌కు గురయ్యారు. అయితే ప్రతిపక్షాల వారు ఈ పనికి పాల్పడినట్లు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తనపై చెప్పులు విసిరిన వారిపై మనోబాలా మండిపడ్డారు. ఈయనపై ప్రజల ఆగ్రహానికి కారణం మాత్రం తెలియరాలేదు.