సెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ.. ఇప్పుడు ఎక్కడవిన్నా ఈ పదమే వైరల్‌లా వినబడుతుంది. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో సెల్ఫీ తీసుకోవడం పెద్ద విషయం కాదు. అలాగే సాహసం చేయడం కూడా పెద్ద విషయం కాదు. ఎలాంటి తరుణంలోనైనా సెల్ఫీ తీసుకోవడం అనేది ఇప్పుడు యువతులకు ఒక ఫ్యాషన్‌గా మారింది. సరదాగా తీసుకునే సెల్ఫీలు ఒక్కోసారి ప్రాణం మీదికి కూడా తీసుకొస్తాయి, మరికొన్ని జైలుపాలు చేస్తుంది. అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది.
పూర్తి వివరాలను పరిశీలిస్తే....చెన్నైలోని అరియళూరు ప్రాంతానికి చెందిన మణి అనే వ్యక్తి ఉద్యోగ రీత్యా విదేశాల్లో నివాసముంటున్నాడు. కాగా ఇతనికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. 2009లో తన స్వదేశమైన చెన్నైకి తిరిగివచ్చిన మణి అతని భార్య విజయలక్ష్మితో సంతోష జీవితాన్ని గడిపేవాడు. ఏమైందో ఏమో గాని ఉన్నట్టుండి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరుచూ ఆమెతో గొడవపడుతుండేవాడు. చిన్నచిన్న గొడవులు కాస్త పెను తుఫానులా మారింది. ఇదే క్రమంలో ఒకరోజు భార్య గొంతు కోసి అక్కడినుండి పారిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు మణిపై కేసునమోదు చేసుకుని అతడి కోసం ఏడేళ్లుగా గాలిస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఏంటంటే... ఇటీవల మణి తన మిత్రులతో కలిసి దిగిన సెల్ఫీని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఫోటో చూసిన విజయలక్ష్మి బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫొటోలు పోస్ట్ చేసిన ఫేస్‌బుక్ ఖాతా ఆధారంగా పోలీసులు మణిని అరెస్ట్ చేశారు. ఎవరికీ దొరక్కుండా పేరు విజయ్‌గా మార్చుకుని నాలుగేళ్లు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసి, ఆ తర్వాత చెన్నైలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడని, అక్కడ పనిచేస్తున్న తోటి సిబ్బందితో సెల్ఫీ దిగి పోస్ట్ చేయడంతో నిందితుడు దొరికిపోయాడని పోలీసులు తెలిపారు.