Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుమతి రాగానే అమ్మ ఫొటోలు బహిర్గతం: అమ్మ మృతిలో మిస్టరీ లేదన్న దినకరన్ అనుచరుడు

నేడో రేపో అంటూ దోబూచులాడిన అన్నాడీఎంకే ప్రత్యర్థి వర్గాల మధ్య విలీనం పూర్తిగా ఆటకెక్కినట్లే. దీనికి పరాకాష్టగా అమ్మ జయలలిత మరణంలో ఎలాంటి మిస్టరీ లేదని తగిన అనుమతి రాగానే అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్

అనుమతి రాగానే అమ్మ ఫొటోలు బహిర్గతం:  అమ్మ మృతిలో మిస్టరీ లేదన్న దినకరన్ అనుచరుడు
హైదరాబాద్ , గురువారం, 4 మే 2017 (06:50 IST)
నేడో రేపో అంటూ దోబూచులాడిన అన్నాడీఎంకే ప్రత్యర్థి వర్గాల మధ్య విలీనం పూర్తిగా ఆటకెక్కినట్లే. దీనికి పరాకాష్టగా అమ్మ జయలలిత మరణంలో ఎలాంటి మిస్టరీ లేదని తగిన అనుమతి రాగానే అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న ఫొటోలను విడుదల చేస్తామంటూ శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ వర్గం స్పష్టం చేయడంతో ఇక పన్నీర్ సెల్వం, పళనిస్వామిల మధ్య సయోధ్యకు తావే లేదని స్పష్టమైంది. జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి అపోలో ఆస్పత్రిలో ఆమెకు జరిగిన చికిత్సపై సమగ్ర విచారణ చేయించాలన్న పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్‌ను శశికళ వర్గం  నమ్మినబంటు పళనిస్వామి తోసిపుచ్చడంలో తొలి ఘట్టం పూర్తయినట్లే.
 
గత రెండు నెలలుగా జయ మరణ రహస్యంపై తమపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు శశికళ వర్గం ముందుకొచ్చింది. అపోలో ఆస్పత్రిలో జయ చికిత్స పొందుతున్న ఫొటోలను విడుదల చేస్తానని టీటీవీ దినకరన్‌ అనుచరుడు, అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ కార్యదర్శి పుహళేంది బుధవారం మదురైలో ప్రకటించారు. మరణం వెనుక ఎటువంటి మిస్టరీ లేదని ఆయన అన్నారు.  
 
అపోలో ఆస్పత్రిలో జయలలితకు అంతర్జాతీయ ప్రమాణాలతో జరిగిన చికిత్సను అనుమానిస్తూ అమ్మ మరణం వెనుక మిస్టరీ ఉందని కొందరు నిందలు వేస్తున్నారని పుహళేంది అన్నారు. అందుకే జయలలిత చికిత్స పొందతున్నప్పటి ఫొటోలను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫొటోల విడుదలపై తగిన అనుమతి రాగానే బహిరంగ పరుస్తామని చెప్పారు. ఈ ఫొటోలు విడుదలైతే కొందరి ముఖాలు వాడిపోతాయని పరోక్షంగా పన్నీర్‌సెల్వంను ఎద్దేవా చేశారు.
 
అయితే జయలలిత మరణంపై సీబీఐ లేదా న్యాయవిచారణకు ఆదేశించాలని, శశికళ కుటుంబ సభ్యులను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం వర్గం ప్రధానంగా రెండు షరతులు విధించింది. అయితే ఈ షరతులను శశికళ వర్గం తోసిపుచ్చడంతో ఇరువర్గాల విలీనానికి విఘాతం ఏర్పడింది. అన్నాడీఎంకేలో నెలకొన్న పరిణామాలు, అమ్మ మరణం తదితర అంశాలను ప్రస్తావిస్తూ నేటి నుంచి పన్నీర్‌సెల్వం రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభిస్తున్నారు. పన్నీర్‌ పర్యటనను నీరుగార్చేందుకు శశికళ వర్గం కూడా సిద్ధమవుతోంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆరడుగులు బుల్లెట్ కాదు.. ఇది కశ్మీర బాహుబలి