తమిళనాడులో తెలుగు విద్యార్థుల భవిష్యత్‌ను పరిరక్షించాలి, ఇందుకోసం తెలుగు విద్యార్థులు తెలుగులోనే పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని చెన్నపురి కేంద్రంగా పనిచేస్తున్న ద్రావిడదేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు డిమాండ్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాషను పరిరక్షించేందుకు గత కొన్ని రోజులుగా ఆయన నేతృత్వంలోని వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులోభాగంగా, ఈనెల 11వ తేదీన తిరువళ్ళూరు తెలుగు భాషా పరిరక్షణ మహానాడు నిర్వహించనున్నారు. పళ్ళిపట్టులోని హరిగోపాల్ కళ్యాణ వేదికలో జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదే అంశంపై ఆయన శుక్రవారం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో తెలుగు భాష పరిరక్షణ కోసం గత కొన్ని రోజులుగా అహింసాయుత మార్గంలో వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇందులోభాగంగానే ఈ మహానాడును నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే ఇదే తరహా మహానాడును హోసూరులో నిర్వహిస్తామని తెలిపారు.
తెలుగు భాష పరిరక్షణ కోసం తాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతంగా కలిసి... ఒక వినతిపత్రం కూడా సమర్పించగా, ఆయన సానుకూలంగా స్పందించి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కూడా ఒక లేఖ రాశారని చెప్పి.. ఆ లేఖ ప్రతుల కాపీలను కూడా చూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమిళ మీడియంకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నామో అదేవిధంగా తమిళనాడులో కూడా తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలని జయలలితకు చంద్రబాబు రాసిన లేఖలో కోరారని కృష్ణారావు వెల్లడించారు
ఇకపోతే 1968లో 40 శాతం ప్రజలు ఉండగా, 1981లో ఈ సంఖ్య 15 శాతానికి పడిపోయినట్టు 1993లో తమిళనాడు ప్రభుత్వం జారీ చేసి జీవో నంబరు 83/1993లో పేర్కొందన్నారు. ఇందులో రాష్ట్రంలోని 11 జిల్లాలో మైనార్టీ ప్రజలు ఉన్నాయని తెలిపినట్టు వెల్లడించారు. అయితే, ఈ గణాంకాల్లో వాస్తవం లేదన్నారు. అంతేకాకుండా, 2006 వరకు తెలుగు భాషకు ఎలాంటి హాని కలగలేదన్నారు. కానీ, 2006లో డీఎంకే ప్రభుత్వం తమిళభాషాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేసి, ఆ శాఖా మంత్రిగా తమిళకుడిమగన్‌ను నియమించారన్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో నిర్బంధ తమిళంపై జీవోను జారీ చేసిందన్నారు.
ఆ జీవోను ఆధారంగా చేసుకుని ప్రస్తుత ప్రభుత్వం జీవో నంబరు 316ను జారీ చేసి.. వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే తెలుగు విద్యార్థులంతా తమిళంలోనే పరీక్షలు రాయాలన్న నిబంధన విధించిందన్నారు. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన తెలుగు విద్యార్థులు పదో తరగతిలో పరీక్షలను తమిళంలో ఎలా రాస్తారని కృష్ణారావు ప్రశ్నించారు. అంతేకాకుండా, ఆరంభంలో రాష్ట్రంలో 17 వేల తమిళ పాఠశాలలు ఉంటే, 8 వేల తెలుగు పాఠశాలలు ఉండేవన్నారు. ఆ తర్వాత తమిళ పాఠశాలల సంఖ్య 70వేలకు పెరగగా, తెలుగు పాఠశాలల సంఖ్య 800 పడిపోయిందన్నారు. కానీ, ఏపీలో తమిళపాఠశాలల సంఖ్య 26 నుంచి 380కు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
తాము తమిళం నేర్చుకునేందుకు, చదువుకునేందుకు, తమిళ భాష అభివృద్ధికి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. కానీ, తెలుగు ప్రజలు తమ మాతృభాష అయిన తెలుగులో చదువుకునేలా ప్రభుత్వం సహకరించాలన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని ఆయన కోరారు. కానీ, తమిళనాడులో ద్విభాషా విధానం ఉందన్నారు. దీనివల్లే సమస్య ఉత్పన్నమైందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జయలలిత ప్రత్యేకంగా దృష్టిసారించి.. తెలుగు భాషను, తెలుగు విద్యార్థుల భవిష్యత్‌ను పరిరక్షించాలని ఆయన ప్రాధేయపడ్డారు. ఈ కార్యక్రమంలో తిరువళ్లూరు సహకార బ్యాంకు అధ్యుక్షుడు రాజేంద్రనాయుడు, పళ్లిపట్టు తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు, ప్రధానోపాధ్యాయుడు వి. కుమార స్వామి, కె. మధు (వేద విజ్ఞాన వేదిక), మాజీ ప్రిన్సిపాల్ యతిరాజులు, నగర ప్రముఖుడు ఎరుకలయ్య, విశ్రాంత ఉపాధ్యాయుడు ఆనందనాయుడు తదితరులు పాల్గొన్నారు.