కాలేజీ రోజుల్లో చేసినఅప్పులు తీర్చేందుకు.. ఫ్లిప్‌కార్ట్ కొరియర్ బాయ్‌గా మోసాలు చేశాడు.. ఎలాగంటే?
ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ నేరాల సంఖ్య బాగానే పెరుగుతోంది. మొన్నటికి మొన్న మొబైల్ ఫోన్ ఆర్డర్ చేస్తే డిటర్జెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో మీరు ఏమైనా ఖరీదైన వస్తువులు బుక్ చేసుకుని వాటికి బదులు న
ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ నేరాల సంఖ్య బాగానే పెరుగుతోంది. మొన్నటికి మొన్న మొబైల్ ఫోన్ ఆర్డర్ చేస్తే డిటర్జెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో మీరు ఏమైనా ఖరీదైన వస్తువులు బుక్ చేసుకుని వాటికి బదులు నకిలీలు వస్తున్నాయా? అయితే ఇదంతా సదరు సంస్థ చేస్తున్న మోసం అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే... నిజంగా ఇదంతా డెలివరీ బాయ్‌ల హస్త వాటం.
ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన ఐఫోన్లను మాయం చేస్తున్నాడు చెన్నైకి చెందిన ఓ డెలివరీ బాయ్. ఒరిజినల్ ఫోన్లకు బదులుగా వాటి స్థానంలో డమ్మీ చైనా ఫోన్లను పెట్టి సంస్థను, కస్టమర్లను మోసం చేస్తున్నాడు. అయితే ఆ ఫోన్లను అందుకున్న కస్టమర్లు ఫోన్లు బాగోలేదని వాటిని తిరిగి ఇస్తున్నారని తిరిగి వాటిని సంస్థకు పంపించేవాడు. ఇలా పలుమార్లు ఒకే ప్రాంతం నుంచి వస్తువులు రిటర్న్ వస్తుండటంతో అనుమానం వచ్చిన యాజమాన్యం విచారణ చేపట్టింది. దీంతో డెలివరీ ఏజెంట్ గుట్టు బయటపడింది.
చెన్నైలోని వాషర్‌మెన్‌పేట ప్రాంతానికి డెలివరీ ఏజెంట్‌గా పనికి చేరాడు 21 ఏళ్ల నవీన్. ఇతడు చాకచక్యంగా ఫ్లిప్‌కార్ట్‌ను మోసం చేశాడు. ఇతడు మోసం చేయడమేకాకుండా డెలివరీ చేసే బాయ్స్‌తో కూడా అబద్దాలు చెప్పించేవాడు. తాను డెలివరీ చేయాల్సిన ప్రాంతంలో ఎవరైనా ఐఫోన్లు ఆర్డర్ చేస్తే, వాటిలోని అసలు ఫోన్లను తీసేసుకుని.. వాటికి బదులు నకిలీ ఫోన్లను కస్టమర్లకు అంటగట్టేవాడు. తర్వాత.. కస్టమర్కు అది నచ్చలేదంటూ వాటిని సదరు సంస్థకు రిటర్న్ఇచ్చేసేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 12 ఫోన్లను అతడు మార్చేశాడు.
అయితే ఒక లాయర్ ఇచ్చిన సలహా ప్రకారమే తాను ఈ ప్లాన్‌ను అమలు చేసినట్టు కూడా చెప్పడం చూసి అందరూ నివ్వెరపోయారు. ఇతని వద్ద నుండి దొంగిలించిన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదటిసారి తనను ఎవరూ పట్టుకోలేకపోవడంతో.. ఈ స్కాంను నెలరోజుల పాటు కొనసాగించాడు. ఎట్టకేలకు ఒకే ప్రాంతం నుంచి ఇలా ఐఫోన్లు తిరిగి వస్తున్న విషయాన్ని ఫ్లిప్కార్ట్ కంపెనీ గుర్తించింది.
వెట్రిసెల్వం అనే గోడౌన్ యజమాని నవీన్ మీద ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. అతడు ముందుగా ఒక నకిలీ చిరునామాతో ఫోన్ ఆర్డర్ చేసి, దాన్ని చైనా ఫోన్తో మార్చేశాడని.. కస్టమర్కు నచ్చలేదంటూ దాన్ని తిరిగి గోడౌన్కు తెచ్చాడని వెట్రిసెల్వం పోలీసులకు చెప్పారు. బీకాం చదివిన నవీన్.. తన అప్పులు తీర్చుకోలేక ఇలా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కాలేజి రోజుల్లో విలాసవంతమైన జీవితం గడపడం కోసం స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. వాటిని తీర్చడానికే ఇలా చేశాడని పోలీసులు తెలిపారు.