రూ.1.60 కోట్ల మేర అవకతవకలు: విశాల్ ఫిర్యాదు.. శరత్ కుమార్‌కు కష్టాలు!!
శరత్ కుమార్-విశాల్‌ల పోరుకు నో బ్రేక్: రూ.1.60 కోట్ల అవకతవకలు.. ఫిర్యాదు!
నటుడు, రాధిక భర్త శరత్ కుమార్‌కు కష్టాలు తప్పట్లేదు. శరత్ కుమార్‌కు నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ మధ్య పోరుకు బ్రేక్ పడేలా లేదు. వీరిద్దరి మధ్య వివాదం రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా విశాల్ తరఫున నగర పోలీసు కమిషనరు కార్యాలయంలో శరత్ కుమార్‌పై ఫిర్యాదు నమోదైంది. నడిగర్ సంఘంలో లావాదేవీల్లో అవకతవకలు జరిగాయంటూ విశాల్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ సంతకం చేసిన ఓ ఫిర్యాదుపత్రాన్ని ఆ సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పూచ్చి మురుగన్ గురువారం ఉదయం నగర పోలీసు కమిషనరు కార్యాలయంలో అందించారు. ఈ ఫిర్యాదులో సంఘం పూర్వ నిర్వాహకులు శరత్‌కుమార్, రాధారవి, వాగై చంద్రశేఖర్ తదితరులు 2009 నుంచి సక్రమంగా లెక్కలను నిర్వహించలేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. తాజా లెక్కల ప్రకారం రూ.1.60 కోట్ల మేర నడిగర్ సంఘం లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. దీనిపై వివరణ కోరినప్పటికీ సరైన సమాధానం రాలేదని తెలిపారు.
శరత్‌కుమార్ సహా గత నిర్వాహకులపై చట్టపరమైన చేపట్టాలని ఆ పత్రంలో కోరారు. అయితే శరత్‌కుమార్ కూడా కమిషనరు కార్యాలయానికి వచ్చి ఓ ఫిర్యాదుపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. విశాల్ ప్యానెల్ గెలిచిన వెంటనే సంఘం లావాదేవీలకు సంబంధించిన వివరాలు వారికి సమర్పించానని తెలిపారు. లెక్కలు చూపలేదని ఇప్పుడు అసత్యాలు చెప్తున్నారని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. అభ్యర్థుల ముఖాముఖిని అడ్డుకోవడానికి కుట్ర జరుగుతోందన్నారు. ఆదాయం లేని సంఘంలో ఎలా అవకతవకలు జరుగుతాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని తాను చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు.