రెండాకులపై అదనపు ఆధారాలు చూపండి.. ఈసీ మడతపేచీతో ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాల్లో భయం
అన్నాడీఎంకే అఖండ విజయాలకు దశాబ్దాలుగా సాక్షీభూతంగా నిలిచిన ఆ పచ్చనాకులు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో బందీ అయిపోయాయి. అమ్మ జయలలిత పార్టీలోని ప్రతి ఒక్కరూ విజయ సంకేతంగా భావిస్తూ, తిరుగులేని స్ఫూర్తిని పొందుతూ వచ్చిన రెండాకుల గుర్తు కోసం పార్టీలోన
అన్నాడీఎంకే అఖండ విజయాలకు దశాబ్దాలుగా సాక్షీభూతంగా నిలిచిన ఆ పచ్చనాకులు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో బందీ అయిపోయాయి. అమ్మ జయలలిత పార్టీలోని ప్రతి ఒక్కరూ విజయ సంకేతంగా భావిస్తూ, తిరుగులేని స్ఫూర్తిని పొందుతూ వచ్చిన రెండాకుల గుర్తు కోసం పార్టీలోని ప్రత్యర్థి వర్గాలు తలపడటంతో ఎలుకల మధ్య తగాదాను పిల్లి తీర్చినట్లు రెండాకులు ఏ ఒక్క వర్గానికీ కాకుండా పోయాయి. రెండాకుల గుర్తు కోసం శతవిధాలా ప్రయత్నించిన శశికళ వర్గం రాజమార్గంలో పనికాకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘానికే భారీ ముడుపులు సమర్పించే సాహసానికి ఒడిగట్టి భస్మాసుర హస్తాన్ని తనపైనే మోపుకుంది.
ఏప్రిల్ 17న కొలిక్కి రావలసిన అన్నాడీఎంకే అదికార చిహ్నం సమస్య శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్ నిర్వాకంతో మళ్లీ మొదటికొచ్చింది. తననే ముడుపులతో ప్రలోభపెట్టడానికి దినకరన్ చేసిన దుస్సాహసిక చర్యతో విసిగిపోయిన ఎన్నికల కమిషన్ తాజాగా జారీచేసిన ప్రకటన అన్నాడీఎంకే ప్రత్యర్థి వర్గాలను బెంబేలెత్తిస్తోంది. చిహ్నం కోసం జూన్ 16వ తేదీలోగా అదనపు ఆధారాలను సమర్పించాల్సిందిగా అన్నాడీఎంకేలోని ఇరువర్గాలను ఎన్నికల కమిషన్ శుక్రవారం ఆదేశించింది. విలీనం ద్వారా రెండాకుల చిహ్నాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్న ఎడపాడి, పన్నీర్‌వర్గాలకు ఆధారాలపై గడువు విధించడం ద్వారా ఎన్నికల కమిషన్ షాకిచ్చింది.
ఇరువర్గాల నేతలు ఆధారాలతో ముందు కెళతారా, వీలీనానికి ప్రాధాన్యం ఇస్తారా లేకుంటే రెండాకుల చిహ్నాన్ని చేజార్చుకుంటారో వేచి చూడాల్సి ఉంది. విలీనం మాట దేవుడెరుగు... అధికార చిహ్నం తమకు దక్కుతుందా లేక ఈసీ శాశ్వతంగా తన వద్దే పెట్టుకుంటుందా అనే డైలమ్మా అటు ఎడపాడి పళనిస్వామి వర్గాన్ని, ఇటు పన్నీర్ సెల్వం వర్గాన్ని వేధిస్తోంది.
రెండాకుల గుర్తు అన్నాడిఎంకే ఉజ్వల వికాస చరిత్రకు సాక్షీభూతం. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీకి, రెండాకుల చిహ్నంకు రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉంది. రెండాకుల చిహ్నం చూడగానే ప్రజల కళ్ల ముందు ఎంజీఆర్, జయలలిత కదలాడుతారు. అంతే పూనకం వచ్చినట్లుగా బ్యాలెట్ పేపరు మీదున్న రెండాకుల గుర్తుపై ఓటు ముద్రవేస్తారు. ఏదో బలమైన తప్పుచేసినపుడు మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఓడించారు, లేకుంటే శాశ్వతంగా అధికారంలో ఉండగల సత్తా ఆ పార్టీకి ఉందని ఒక డీఎంకే నేతనే అంగీకరించాడంటే రెండాకుల వైభవాన్ని అర్థం చేసుకోవచ్చు.