ఒకవైపు ఆధార్ కార్డు లేక, దరఖాస్తు చేసుకున్నప్పటికీ అది రాక ప్రజలు నానా ఇక్కట్లు పడుతుంటే వచ్చినవాటిని పంపిణీ చేయలేక వాటిని ఓ కుప్పతొట్టిలో పడవేసిన ఘటన తమిళనాడులోని తిరుపత్తూరు మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే... వేలూరు జిల్లా తిరుపత్తూరులోని లక్ష్మీనగర్, ఆశ్రియ నగర్ పరిధిలో ఉన్న ప్రజలు గత కొంతకాలంగా ఆధార్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.
ఐతే వారి ఆధార్ కార్డులు చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. సుమారు 2 వేలకు పైగా ఆధార్ కార్డులు కుప్పతొట్టిలో అగుపించడంతో ఆ గ్రామాల ప్రజలంతా అక్కడికి చేరుకుని వాటిని తీసుకుని వెళ్లి ఆశ్రియనగర్ బ్రాంచ్ పోస్టాఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న తిరుపత్తూరు సూపరిండెంట్ అక్కడికి చేరుకుని పంపిణీ చేసేందుకు పోస్ట్ మేన్ లేని కారణంగా వాటిని చెత్తకుప్పలో పడవేసి ఉంటారని చల్లగా కబురు చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.