భారత చలనచిత్ర చరిత్రలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించిన సంగీత దర్శకుల్లో ఏ.ఆర్. రెహ్మాన్ ఒకరు. ఓ సాధారణ కీబోర్డ్ ప్లేయర్‌గా కెరీర్ ప్రారంభించి నేడు ప్రపంచం గర్వించదగ్గ ఓ సంగీత దర్శకుడి స్థాయికి చేరుకున్న రెహ్మాన్ తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
అందుకే ఒక్క భారతీయ చలనచిత్రాలకే కాకుండా పరదేశీయ చిత్రాలకు సైతం ఆయన సంగీతాన్ని అందించగల్గుతున్నారు. జనవరి 6, 1966లో తమిళనాడు రాష్ట్రంలో జన్మించిన రెహ్మాన్ చిన్ననాటి నుంచే సంగీతంపై అభిరుచి పెంచుకుని ఆ వైపుగానే తన పయనం సాగించారు. అంతేకాదు తన పయనంలో ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకున్నారు.
మరెన్నో అవార్డులను, రివార్డులను దక్కించుకున్నారు. ఈ విధమైన అవార్డుల పరంపరలో భాగంగా తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు. ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాధించిన రెహ్మాన్ పరిశీలిస్తే ఎన్నో మంచి సుగుణాలు మనకు కన్పిస్తాయి.
నిగర్విగా, పదిమందికి సాయపడే వ్యక్తిగా ఎలాంటి విభేదాలు లేనివ్యక్తిగా రెహ్మాన్ అందరి మన్ననలు చూరగొన్నారు. తాను, తన సంగీత ప్రపంచం తప్ప మరెలాంటి ఆర్భాటాలకి పోని వ్యక్తిగా ఉండబట్టే రెహ్మాన్ నేడు ఈ రకమైన ఉన్నతస్థితిని సాధించగలిగారు. రెహ్మాన్‌లో మనకు కన్పించే ఈ లక్షణాలు ఆయనలో మాత్రమే కాకుండా జనవరి ఆరున జన్మించిన దాదాపు అందరిలో కన్పిస్తాయి.
ఈ తేదీన జన్మించినవారు లక్ష్యంపై గురి ఉన్నవారై ఉంటారు. ఆరంభ శూరత్వం కాకుండా మనసులో ఏర్పడిన లక్ష్యాన్ని సాధించడంతో అహర్నిశలు శ్రమిస్తారు. ఇలా శ్రమించే గుణం ఉండడం ద్వారానే వీరు తాము ఎంచుకున్న రంగంలో వీలున్నంత మంచి స్థితిలో కొనసాగుతుంటారు. పని మాత్రమే ప్రపంచంగా బ్రతికే వీరు దాదాపు అజాత శత్రువులుగానే ఉంటారు.