దక్షిణాద్రి చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌గా ప్రియమణిని చెప్పుకోవచ్చు. చిత్రసీమలోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న ప్రియమణి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు బాలకృష్ణకు జంటగా మిత్రుడు చిత్రం ద్వారా త్వరలో తెరమీదకు రానుంది.
ఈ నేపథ్యంలో ప్రియమణి వ్యక్తిగతాన్ని ఓసారి పరిశీలిస్తే బెంగుళూరులో జన్మించిన ఈ భామ బీఏ సైకాలజీ విద్యార్ధి కావడం విశేషం. కాలేజీ చదువు తర్వాత మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రియమణి ప్రారంభంలో పలు సంస్థలకు చెందిన వ్యాపార ప్రకటనల్లో నటించింది. దీనితర్వాత తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమైన ప్రియమణికి తెలుగులో తొలి చిత్రం పెళ్లైన కొత్తలో. ఈ చిత్రంలో జగపతిబాబుతో కలిసి నటించిన ప్రియమణికి పెద్దగా గుర్తింపు రాలేదు.
అయితే తమిళంలో ఈ దశలో నటించిన పరుత్తివీరన్ అనే చిత్రంలో ప్రియమణి నటనకు జాతీయ అవార్డు లభించడం గమనార్హం. ఈ పురస్కారంతో ప్రియమణికి హీరోయిన్‌గా తగిన గుర్తింపు లభించినట్టైంది. దీంతో ప్రియమణికి వరుసగా అవకాశాలు రావడం ప్రారంభించాయి. ఈ కోవలోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగలో ప్రియమణి తెలుగు ప్రేక్షకులను అలరించింది.
ఇలా ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా ఒక్కో మెట్టు ఎదుగుతున్న ప్రియమణి వ్యక్తిత్వాన్ని గమనిస్తే కష్టపడే తత్వం, అనుకున్నదాన్ని సాధించే దిశగా ప్రయత్నం అనే అంశాలు ప్రస్పటంగా కనిపిస్తాయి. అలాగే పైకి సాంప్రదాయంగా కనిపించినా అవసరాన్ని బట్టి గ్లామర్ పాత్రలకు సైతం సై అనే ప్రియమణిలో అన్ని పరిస్థితులకు సర్ధుకుపోగల తత్వం కనిపిస్తుంది.
అలాగే తగిన గుర్తింపు లభించిన తర్వాత తన కెరీర్‌కు సంబంధించిన విషయాల్లో కాస్త ముక్కు సూటిగా వ్యవహరించడం కూడా ప్రియమణిలో మనం గమనించవచ్చు. ప్రియమణిలో కన్పించే ఈ లక్షణాలన్నీ ఆమె పుట్టిన రోజైన జూన్ 4కు వర్తించే రాశి అయిన మిథునరాశిలో జన్మించిన వారిలోనూ ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. ఈరాశిలో జన్మించినవారు కెరీర్‌కు సంబంధించి చాలా ఖచ్చితంగా ఉంటారు.
అలాగే చిన్ననాటినుంచి వీరికి పదిమందిలో గుర్తింపు తెచ్చుకోవాలనే తపన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీంతోపాటు అనుకున్నది సాధించేవరకు వేచి చూడగల ఓపిక వీరిసొంతం. అయితే ముక్కుసూటిగా వ్యవహరించే వీరితత్వం చూచేవారికి పొగరుగా అనిపిసుంది. దీనివల్ల ఎదుటివారు వీరిని పొగరబోతులుగా జమకట్టే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలో వీరు జాగ్రత్తగా వ్యవహరించగల్గితే విజయాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి.