ఫ్యాషన్ రంగంలో పరుగు పెట్టించే అవకాశాలు నేటి యువత కోసం ఎదురు చూస్తున్నాయి. అందాన్ని ఆస్వాదించడం, సృజనాత్మకంగా ఆలోచించడం, ప్రతిభాపాటవాలు ఈ రంగానికి అవసరమైన ప్రాథమిక లక్షణాలని చెప్పవచ్చు. అంతేకాక మార్కెట్లో మారుతున్న పరిస్థితులు, ఏర్పడుతున్న అవసరాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉండాలి.
మారుతున్న దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా నేడు యువత ఈ రంగంపై అధిక ఆసక్తి చూపడంతో పాటు అవకాశాలు కూడా పుష్కలంగానే లభిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారత పట్టు, చేనేత వస్త్రాలకు మంచి ఆదరణ కన్పిస్తోంది. ఈ కారణంగానే ఫ్యాషన్ ప్రపంచంలో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది.
ఇతరులచే రూపొందించబడిన సంప్రదాయ రూపకల్పనల కన్నా తామే సొంతంగా తయారు చేసుకునే ఆధునిక ఫ్యాషన్లవైపే యువత మొగ్గు చూపుతోంది. దుస్తులు, ఆభరణాలు, అలంకరణలు, తోలు ఉత్పత్తులు, ఫోటో, మోడలింగ్ అంటూ ఎన్నో అంశాలతో ఈ ఫ్యాషన్ రంగం ముడిపడి ఉంది.
ఈ రంగంలో దుస్తుల రూపకల్పనను ప్రధానమైనదిగా భావిస్తున్నారు. డిజైనింగ్, కటింగ్, స్టిచింగ్, విక్రయించదగిన రీతిలో ప్యాకింగ్ వంటి వివిధ దశలను ఇది కలిగి ఉంది. ఇలా ఉత్పత్తి చేసిన దుస్తులను తిరిగి మార్కెట్లో ప్రచారం చేసేందుకు అవసరమైన మోడెలింగ్, ప్యాషన్ షోలు, టీవీ ప్రకటనలు కూడా తిరిగి ఫ్యాషన్‌తోనే ముడిపడి ఉంది.
భారత దుస్తులపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కలిగి ఉండటానికి ఈ ఫ్యాషన్ ముఖ్య కారణమని చెప్పవచ్చు. ఫ్యాషన్ తగిన అవగాహన, ఆసక్తి లేని వారు ఈ రంగంలో రాణించడం కష్టమే. విదేశీ మ్యాగజైన్లను చదవడం, సాంస్కృతిక కేంద్రాలకు వెళ్లడం, ఫ్యాషన్ షోలను సందర్శించడం వంటివి మన సామర్థ్యాన్ని పెంచగలవు.
దుస్తుల గుణాలను తెలుసుకుని, వాటిని ఎంచుకోవడం కూడా తెలుసుకోవాలి. మనకు మనమే రూపొందించే కొన్ని ప్రత్యేక రకాలు మార్కెట్లో మంచి ఆదరణ పొందగలదు.
ఈ రంగానికి సంబంధించిన అవకాశాలను పరిశీలిస్తే... డిజైనింగ్ విభాగంలో డిజైనర్లు, కట్టింగ్ అసిస్టెంట్, స్కెచింగ్ అసిస్టెంట్, జూనియర్ డిజైనర్లు కావాల్సి ఉంటుంది. అలాగే మార్కెటింగ్, మెర్కండైజింగ్ విభాగంలో ట్రెండ్స్ గురించి తెలుసుకుంటున్న వారి అవసరం ఉంటుంది.
ఈ రంగంలో కోర్సులు చేసిన వారికి దుస్తులు, చేనేత ఎగుమతి సంస్థల్లో, క్రీడా, క్యాజువల్ వస్త్రాలు తయారు చేసే సంస్థలు, ప్రభుత్వ రంగ చేనేత, టెక్స్టైల్ సంస్థలు, ఫ్యాషన్ మేళాలు నిర్వహించే సంస్థలు, టీవీ, సినిమా రంగ కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు, కాస్ట్యూమ్ డిజైనింగ్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
వ్యక్తిగత సామర్థ్యం ప్రాతిపదికనే వేతనాలు నిర్ణయిస్తున్నారు. కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన వారికి రూ. 8నుంచి రూ. పది వేల మేరకు జీత. భత్యాలు అందుతున్నాయి. ఫ్యాబ్రిక్ డిజైనింగ్ రంగంలో నిపుణుల కొరత అధికంగా ఉంది.
దుస్తులకు సంబంధించినవే కాకుండా తోలు ఉత్పత్తులు, ఫుట్‌వేర్, గిఫ్ట్వేర్, టేబుల్‌వేర్, విలువైన ఆభరణాలు వంటివి ఫ్యాషన్ రంగంలో ముఖ్య భాగంగా ఉంది. మోడెలింగ్కు తగిన ఫ్యాషన్లు కూడా ఉన్నాయి. భారత్ నుంచి ప్రపంచ అందాల రాణులు వచ్చిన తర్వాత ఈ రంగానికి మంచి ఆదరణ లభిస్తోంది.
ఈ విభాగంలో డిజైనర్, హెయిర్ స్టయిలిస్ట్, డెంటిస్ట్, డైటీషియన్ ఉద్యోగాలు ఉంటాయి. అలాగే ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ రోజుకు రూ. 3నుంచి రూ. పది వేల వరకు సంపాదించగలరు. ఈ ఫ్యాషన్‌కు సంబంధించిన కోర్సులను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ జాతీయ స్థాయిలో నిర్వహిస్తుంది.
గ్రూప్ డిస్కషన్, గ్రూప్ సామర్థ్యం తదితరాలను కూడా ఎంపిక ప్రక్రియలో అదనంగా చేర్చుతున్నారు. నిఫ్ట్ కోర్సులకు పెద్ద స్థాయిలో డిమాండ్ ఉండగా, ప్రస్తుతం ఈ ఫ్యాషన్ కోర్సులను అందించే సంస్థలు క్రమంగా పెరుగుతున్నాయి.