ఖరగ్‌పూర్ ఐఐటీ విద్యార్థిని అదృష్టదేవత వరించింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో భాగంగా ఆ విద్యార్థికి రూ.1.5 కోట్ల వార్షిక వేతనం ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకువచ్చింది.
క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఓ విద్యార్థికి ఇంత భారీ ప్యాకేజీ లభించడం ఇదే మొదటిసారి అని ఖరగ్‌పూర్ ఐఐటీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సదరు విద్యార్థికి కలిగే ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని అతని పేరు కానీ, ఆఫర్ ఇచ్చిన సంస్థ పేరు కానీ వెల్లడించడం లేదని తెలిపాయి.
కాగా, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మొత్తం 27 కంపెనీలు పాలుపంచుకోగా, 163 మందికి అవకాశాలు లభించాయని కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్, ఐఐటీ-ఖరగ్‌పూర్ ఛైర్మన్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్ బరారీ తెలిపారు.
ఈ యేడాది ఓ భారత ఐఐటీ విద్యార్థికి లభించిన అత్యధిక వేతన ఆఫర్ ఇదే కావడం గమనార్హం. ఈ ఆఫర్ విదేశాలకు వెళ్లి పని చేసే ఒప్పందంపై ఆ విద్యార్థికి లభించిందని, ఇక మన దేశంలో పనిచేసే విషయానికి వస్తే ఓ విద్యార్థి రూ.42 లక్షల ప్యాకేజి అందుకున్నాడని తెలిపారు.
విద్యార్థి వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. మొత్తం క్యాంపస్ ఇంటర్యూల్లో ఇప్పటి వరకు 251 మందికి జాబ్ ఆఫర్లను లభించినట్టు చెప్పారు. ఇందులో 88 మందికి ముందుగా ఆఫర్లు వచ్చాయన్నారు.