Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శరవేగంగా 'పది'కి ఏర్పాట్లు పదో తరగతి విద్యార్థినులు

శరవేగంగా 'పది'కి ఏర్పాట్లు పదో తరగతి విద్యార్థినులు
, బుధవారం, 11 మార్చి 2020 (15:06 IST)
ఏపీలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ నెల 23 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను ప్రభుత్వం 31వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న మార్పులపై ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో శిక్షణ కల్పించిన విద్యాశాఖ అధికారులు పరీక్షల విధి నిర్వహణలో పాటించాల్సిన నియమ, నిబంధనలపై జిల్లాలోని ఐదు విద్యాశాఖ డివిజన్ల వారీగా చీఫ్‌ సూపరింటెండెంట్లు, శాఖాధికారులకు అవగాహన కల్పించారు. దీంతో పాటు ఐదు డివిజన్ల వారీగా సమీక్షా సమావేశాలను సైతం పూర్తి చేశారు. 
 
జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లోని 1,041 ఉన్నత పాఠశాలల నుంచి పరీక్షలకు హాజరుకానున్న 60,042 మంది విద్యార్థులకు 269 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లతో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి కేంద్రీకరించారు. దీంతోపాటు పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులనే నియమించేందుకు చర్యలు చేపట్టారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని చీఫ్‌ సూపరింటెండెంట్‌గా నియమించడంతో పాటు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులను ఒక్కో కేంద్రానికి ఒకరి చొప్పున పర్యవేక్షణకునియమిస్తున్నారు.
 
3,000 మంది ఇన్విజిలేటర్లు : 
పదో తరగతి పరీక్షల విధులకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మూడు వేల మంది ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించేందుకు చర్యలు చేపట్టారు. ఇన్విజిలేటర్లుగా నియమించే క్రమంలో సీనియారిటీతో పాటు గతంలో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏ మండలంలో పని చేస్తున్న ఉపాధ్యాయులను అదే మండలంలోని పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్లుగా నియమించాలని ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్‌ ఏ.సుబ్బారెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు. 
 
ప్రతి మండల పరిధిలోని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఇన్విజిలేటర్ల మొత్తం సంఖ్యను పరిగణలోకి తీసుకుని, అవసరమైతేనే పక్క మండలాల్లోని ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది మండల పరిధిలోని ఇన్విజిలేటర్ల సంఖ్యలో ఐదు శాతానికి మించకూడదని స్పష్టం చేశారు. దీంతో పాటు పరీక్షా కేంద్రాల్లో మాల్‌ ప్రాక్టీసుతో పాటు అవకతవకలకు ఆస్కారం ఇవ్వకుండా ఇన్విజిలేటర్లను ప్రతి మూడురోజులకోసారి జంబ్లింగ్‌ విధానంలో ఇతర పరీక్షా కేంద్రాలకు పంపనున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్‌ మెటీరియల్‌ జిల్లాకు చేరవేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. విద్యార్థుల హాల్‌ టికెట్లను పరీక్షలకు వారం రోజుల ముందుగా పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనుషులను చంపేస్తూ రాజకీయాలు చేస్తారా? చంద్రబాబు ఫైర్