చదువుకుంటూనే భవిష్యత్తుకు రూపకల్పన చేసుకునే చార్టెర్డ్ అకౌంటు విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇటు సిఏ ఇంటర్న్‌షిప్‌కు వెళ్ళలేక, అటు బీకాం క్లాసు వదల్లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. రెగ్యులర్ కళాశాల సమయం, సిఏ శిక్షణా సమయం పరస్పరం అడ్డుపడుతున్నాయి.
పైగా కళశాలల ప్రిన్సిపాళ్ళు కూడా వారు శిక్షణ కోసం వెళ్ళేందుకు అనుమతించడం లేదు. దీంతో చదువుతూ భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోవడం వారికి సాధ్యమవడంలేదు. సాధారణంగా పదవ తరగతి పూర్తయినప్పటి నుంచే సిఏ చేయడానికి పునాది వేసుకోవచ్చు. మూడు దశలలో జరిగే పరీక్షలను రాసి సిఏ ప్రాక్టీసు చేయవచ్చు.
అదే సమయంలో రెగ్యులర్‌గా చదువుకోవచ్చు. ఇలా ముంబయిలో చాలా మంది బీకాం చదువుతూ సిఏలోని పరీక్షలు రాసుకోవచ్చు. ఇలాంటి సమయంలో వారు సీనియర్ చార్టెర్డ్ అకౌటెంట్ వద్ద శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం కొంత సమయం అక్కడ ఉండాలి.
ఇలాంటి సమయంలో కళాశాలల ప్రిన్సిపాళ్ళ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొన్ని కళాశాలలు అనుమతిస్తున్నాయి. మరి కొన్ని కళాశాలల ప్రిన్సిపాళ్ళు అనుమతికి నిరాకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో వారు ఇటు బీకాంకు, సీఏ శిక్షణకు మధ్య నలుగుతున్నారు.