రాష్ట్రంలోని విద్యార్థులకు పరీక్షల ఫీవర్ పట్టుకుంది. ఒక వైపు పోటీ పరీక్షలతో పాటు మరోవైపు వార్షిక పరీక్షలు జతకావడంతో విద్యార్థులు పుస్తకాల పురుగుల్లా తయారయ్యారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న ఉస్మానియా, కేంద్రీయ విద్యాలయాల్లోని ఏ చెట్టు కింద చూసినా పుస్తకం పట్టుకున్న విద్యార్థులే కనిపిస్తారు. ప్రతి యూనివర్సిటీ లైబ్రరీలలో కూడా విద్యార్థులు, పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కనిపిస్తున్నారు.
హాస్టల్ గదుల్లో, హాస్టల్ ఆవరణలోని చెట్ల కింద, ల్యాండ్ స్కేప్ గార్డెన్ ఇలా ఒకటేంది.. ప్రతి చోటా విద్యార్థులే దర్శనమిస్తున్నారు. విద్యా - పరిశోధనలకు నిలయమైన ఉస్మానియా వర్శిటీలో పోటీ పరీక్షలకు సైతం అనువైన వాతావరణం వుంది.
కానీ ఇటీవల కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరుస నోటిఫికేషన్‌లు విడుదలయ్యాయి. వీటితో పాటు డిఎస్సీ, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మొదలైన ఉద్యోగాల భర్తీ ప్రకటనలు వెలువడ్డాయి. ఇవన్నీ ఏకకాలంలో వివిధ పోటీ పరీక్షలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయనుండటంతో విద్యార్థులు పోటీ పరీక్షలపైనే ప్రధానంగా దృష్టి సారించారు.
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలతోపాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, బ్యాంకు ఉద్యోగాలు, యూజీసీ నెట్, స్లెట్, సిఎస్‌ఐఆర్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతూ.. లైబ్రరీలల్లో కుర్చీలకు అతుక్కుపోతున్నారు. ఒక వైపు తమ రెగ్యులర్ కోర్సులు చదువుతూనే మరో వైపు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు రేయింబవుళ్లు చదువుతున్నారు.
ఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీ కాంపీటీటివ్ ఎగ్జామినేషన్స్ కోచింగ్ సెంటర్ (సెక్) ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు ధీటుగా ఓయూలో శిక్షణ ఇవ్వడం గమనార్హం.