Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంబ్రిడ్జి విద్యార్థుల "గ్రంథ చౌర్యం"

కేంబ్రిడ్జి విద్యార్థుల
, శనివారం, 1 నవంబరు 2008 (12:56 IST)
ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించిన విద్యా సంస్థ అయిన "కేంబ్రిడ్జి యూనివర్శిటీ"లో చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో సగంమంది గ్రంథ చౌర్యానికి పాల్పడుతున్నట్లు తాజా నివేదిక వెల్లడిస్తోంది. ఇంకా, ఇలాంటి విద్యార్థులు పరీక్షల్లో ఫలితాల కోసం అడ్డదారులను కూడా తొక్కినట్లు ఆ నివేదిక చెబుతోంది.

వివిధ విభాగాలకు చెందిన 49 శాతం మంది విద్యార్థులు ఈ అడ్డదారులను ఆశ్రయించినట్లు సాక్షాత్తూ కేంబ్రడ్జి అధికారిక పత్రిక "వర్శిటీ" పేర్కొనడం గమనార్హం. కాపీరాయుళ్లలో అందరికీ నీతిచంద్రికలు వల్లించే న్యాయశాస్త్ర విద్యార్థులే ముందంజలో ఉన్నారని, లా విద్యార్థుల్లో దాదాపు 62 శాతం మంది గ్రంథచౌర్యం ద్వారా గట్టెక్కిన వారేనని తేలినట్లు కూడా ఆ పత్రిక వెల్లడించింది.

వర్శిటీ పరిశోధనల్లో భారీ స్థాయిలో గ్రంథచౌర్యం జరుగుతున్నా, పట్టుబడ్డవారు ఐదు శాతం మంది మాత్రమే కాగా, "వర్శిటీ" పత్రికలో వెలుగులోకి వచ్చిన ఈ గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని బయోలాజికల్ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ రాబర్ట్ ఫోలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే... తమపై మితిమీరిన భారం మోపడం వల్లనే పక్కదారులు పట్టాల్సి వస్తోందని, మరీ విసుగొస్తే ఇంటర్నెట్‌లో వెదికి, హెడ్డింగ్‌తో సహా వ్యాసాలను వర్డ్ డాక్యుమెంట్‌లోకి కాపీ చేసుకుని, దానికి పైపై మెరుగులు దిద్ది ఇచ్చేస్తుంటామని విద్యార్థులు సమర్థించుకుంటున్నారు.

"ఈ రకంగా గ్రంథ చౌర్యం చేసిన వ్యాసాలే సాధారణంగా ఉత్తమ వ్యాసాలుగా గుర్తింపు పొందుతుంటాయని" ఆర్థిక శాస్త్ర విద్యార్థి ఒకరు చెబుతుంటే... గడచిన రెండేళ్లలో తాను మూడు వేర్వేరు పరీక్షలకు ఒకే వ్యాసాన్ని ముగ్గురు సూపర్‌వైజర్లకు సమర్పించానని మరొక విద్యార్థి చెప్పడం చూస్తుంటే... గ్రంథ చౌర్యం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగకుండా, అడ్డదారులకు పాల్పడే విద్యార్థులను కఠినంగా శిక్షించేందుకు వర్శిటీ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కొంతమంది నిజాయితీపరులైన విద్యార్థులు కోరుతున్నారు. అయితే కాపీరాయుళ్ల చెవులకు మాత్రం ఇవేమీ ఎక్కడం లేదు. ఇప్పటికైనా వర్శిటీ యంత్రాంగం మేల్కొని, కాపీరాయుళ్ల అడ్డదారులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu