ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఐబీఎం... ఉన్నతస్థాయి అధ్యయన రంగంలో నిపుణుల కొరతను అధిగమించేందుకు "బ్లూ స్కాలర్" అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థల నుండి విద్యార్థులను ఎంపిక చేయాలని ఐబీఎం ఇండియా నిర్ణయించుకుంది.
ఈ విషయమై ఐబీఎం ఇండియా రీసెర్చ్ లేబొరేటరీ అసోసియేట్ డైరెక్టర్ మనీషా గుప్తా మాట్లాడుతూ... తమ భారత రీసెర్చ్ సెంటర్‌లో ఈ "బ్లూ స్కాలర్" కార్యాక్రమాన్ని పారంభించనున్నామని చెప్పారు. ఇందుకుగాను తాము ఐఏటీలు, ఐఐఎస్‌సీల నుండి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను ఎంపిక చేస్తున్నామని, పరిశోధనా రంగంలో పనిచేసేందుకు అనుగుణంగా వారికి శిక్షణ ఇస్తామని వెల్లడించారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ బ్లూ స్కాలర్ కార్యక్రమానికి అర్హులు. కాగా, ఐబీఎం ఇండియా ఇప్పటికే విద్యార్థుల వేటను కూడా ప్రారంభించిందని, ఇందుకు భారత్ అతి పెద్ద మార్కెట్‌గా నిలుస్తుందని, స్థానిక మార్కెట్‌లో నిపుణుల కోసం తాము ప్రయత్నిస్తున్నామని గుప్తా తెలియజేశారు.
ఎంపికయి, శిక్షణ పొందబోయే బ్లూ స్కాలర్లు ప్రపంచవ్యాప్త ఐబీఎం పరిశోధక బృందాలతో కలిసి పనిచేయనున్నారు. వాస్తవిక పరిశోధనా సంస్కృతిలో వారు మసలేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా పొందిన శిక్షణతో విస్తృతమైన శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు నాంది పలికినట్లవుతుంది.
"అంతేగాకుండా... ఎన్నికైన బ్లూ స్కాలర్స్ గ్లోబల్ రీసెర్చ్ టీంతో సన్నితంగా పనిచేయడమే గాకుండా, వారు పలు అంశాలపై పరిశోధనా పత్రాలను కూడా ప్రచురిస్తారు. సవాళ్లతో కూడిన వాతావరణంలో పనిచేయటంవల్ల వారిలో శాస్త్ర సాంకేతిక సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. తద్వారా పలు సాంకేతిక ఆవిష్కరణలకు మార్గం సులభమవుతుందని" గుప్తా వివరించారు.
ఇదిలా ఉంటే... ఐబీఎం సంస్థకు ప్రపంచవ్యాప్తంగా అమెరికా, చైనా, జపాన్, ఇజ్రాయిల్, స్విట్జర్లాండ్, భారతదేశంలలో ఎనిమిది పరిశోధనా కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలలో దాదాపు 3,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.