దేశంలోని ప్రభుత్వ ఉపాధికల్పనా కార్యాలయాలలో ప్రతి ఏడాది ఐదు లక్షలమందికి పైగా నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రి హరీష్ రావత్ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. గత పది సంవత్సరాల్లో వీరి సంఖ్య దాదాపుగా 56.67 లక్షలకు చేరుకుందని, దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం తమ పేర్లను నమోదు చేసుకున్న వారి సంఖ్య అరకోటికిపైగా ఉందని, ఇది వచ్చే 2022 నాటికి 198.7 మిలియన్లకు చేరుకుంటుందని ఆయన సభకు తెలిపారు.
జాతీయ ఈ-గవర్నెన్స్ పథకం క్రింద ఉపాధి కోరే అభ్యర్థుల ప్రాముఖ్యతను దృష్టిలోపెట్టుకుని తాము ఉపాధికల్పన కార్యాలయాలను తీర్చిదిద్దుతున్నామని ఆయన వెల్లడించారు. వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు మరింతగా కల్పించేందుకు తమ శాఖ కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఆటోరంగంలో దాదాపు 35.2 మిలియన్ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు తాము ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన సభకు వివరించారు. అన్ని రంగాలకన్నా ఆటో రంగంలోనే ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అన్నారు.
ఆరోగ్యక్షేత్రానికి చెందిన పరిశ్రమకు 12.8 మిలియన్ నిరుద్యోగుల అవసరం ఉందని ఆయన తెలిపారు. అలాగే రిటైల్ రంగం, ట్రావెల్, టూరిజం పరిశ్రమ, ట్రాన్స్‌పోర్ట్, లోగిస్టిక్స్ వేర్ హౌసింగ్ రంగంలో కార్మికుల సంఖ్య దాదాపు 17.2 నుంచి 17.7 మిలియన్ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగానున్న 969 ఉపాధికల్పన కేంద్రాల్లో నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా కోరారు.
రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తమ శాఖ కృషి చేస్తోందని, ఇందులో భాగంగా పలురంగాలకు చెందిన నిపుణులు, కార్మికులు, చిరు ఉద్యోగులు, ఐటీ, సేవారంగాలలోను ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.