కొందరు ఎంత కఠినమైన పరీక్షలకైనా ఉత్సాహంగా హాజరవుతారు కానీ ఇంటర్వ్యూకు వెళ్లాలంటే మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. ఏం మాట్లాడేది, ఇలా చెప్పొచ్చా లేక మరే విధంగా చెప్పాలి అని మనసులోనే రిహార్సల్ చేసుకుంటున్నారు. అయితే అలాంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలివ్వాలనే విషయంపై ఇప్పటికే పలువురు నిపుణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ప్రశ్న1. మీ గురించి చెప్పండి అంటే...
ఇలాంటి విస్తృత అవకాశమున్న ప్రశ్నకు ఆ ఉద్యోగానికి, మీకు సంబంధించిన ఐదు ముఖ్య అంశాలను మాత్రం చెప్పొచ్చు. మీరు ఎక్కడ పుట్టారు, చిన్న వయసులో ఏం చేసేవారు అనే వ్యర్థ సమాచారాన్ని నివారించవచ్చు. మీ ప్రతిభాపాటవాలు, గత సంస్థలో మీరు చేసిన ఘనతలు, కొత్త ఉద్యోగంలో మీ పాత్ర అని క్రమంగా వివరించవచ్చు. మళ్లీ ప్రశ్నలడిగే అవకాశం వారికి రాని రీతిలో నిజాయితీతో కూడిన మీ సమాధానాలుండాలి. క్లుప్తంగా చెప్పాలంటే మీ గురించి ఆ ఉద్యోగానికి మీరే ప్రకటన చేసే రీతిలో ఉండాలి.
2. ఎందుకు ఈ రంగాన్ని ఎంచుకున్నారు?
ఈ ప్రశ్నను అధికారి అడిగిన ముఖ్య ఉద్ధేశాన్ని మీరు గమనించాలి. మీ ఆసక్తి ఈ రంగంపై ఎంతమేర ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకే ఆయన ఈ ప్రశ్న అడుగుతున్నారు. కాబట్టి ఈ ప్రశ్నకు మీరు సమాధానమిచ్చే సమయంలో మీరు పూర్తి ఉత్సాహంతో, మానసిక ఉల్లాసంతోనూ ఉన్నట్టు వారికి చూపాలి. అంతేకాక దానికి సంబంధించి మీ లక్ష్యాన్ని కూడా చక్కగా వివరించాలి.
3. మీ బలాలు, బలహీనతల గురించి చెప్పండి...
ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే సమయంలో ఉద్యోగానికి సంబంధించి మీ బలాలు, బలహీనతల గురించి చెప్పండి. సాదారణ వాక్యాలైన నేనో మంచి స్నేహితుడిని రీతి వ్యాఖ్యలను తప్పించి, ఏ పరిస్థితుల్లోనూ ఎవరితోనైనా సర్దుబాటుతో వ్యవహరించగలననే విషయాన్ని వారికి స్పష్టం చేయండి. అలాగే బలహీనతల గురించి చెప్పే సమయంలో కూడా ఉద్యోగం నుంచి తొలగించే వీలు కలిగించే గత చెడు అనుభవాలను క్రమంగా చెప్పకండి. రోజురోజుకూ తాను చేసే తప్పిదాలతో జాబితా రూపొందించి, భవిష్యత్తులో ఆ తప్పిదాలు జరగకుండా చూసుకుంటానని చెప్పండి.
4. మీ ప్రస్తుత ఉద్యోగం లేక గత ఉద్యోగం నుంచి ఎందుకు మారుతున్నారు?
మీరు ఎంత గొప్పగా ప్రకటన చేసుకున్నా ఈ ప్రశ్నకు ఇచ్చే సమాధానమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇది అడిగిన ఉద్ధేశం తెలుసుకుని, కొత్త సంస్ధ అధికారి మిమ్మల్ని ప్రశంసించరు. కానీ ఆ అవకాశాన్ని వదులుకోని రీతిలో మీ భవిష్యత్ లక్ష్యాలకోసమే కొత్త ఉద్యోగాన్ని ఎంచుకుంటున్నట్టు వారికి అర్థమయ్యేలా వివరించండి.
5. ఎంత జీతం ఎదురు చూస్తున్నారు?
ఈ ప్రశ్నకు మీరు ముందే ఓ సమాధానాన్ని సిద్ధం చేసుకోవాలి. మీరు వెళుతున్న సంస్థ స్థితి, అక్కడ మీ పాత్ర, మార్కెట్ స్థితిగతులు తదితరాలను తెలుసుకుని దీనిని నిర్ణయించుకోవాలి. దీనికోసం కొంత హోం వర్క్ చేయాలి. అయితే డబ్బే ప్రధానంగా ఆ ఉద్యోగంలో చేరుతున్నట్టు వారికి అన్పించని రీతిలో సున్నితంగా చెప్పాలి.