దేశంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో 2009 విద్యా సంవత్సర ప్రవేశానికి గాను ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-JEE-2009)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 12వ తేదీన జరుగనున్న ఈ ప్రవేశపరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులు.. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. 2009 మార్చిలో జరుగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు కూడా అర్హులు.
విద్యార్థులు ఖచ్చితంగా 60 మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులకు మాత్రం 55 శాతం మార్కులు పొందివుంటే సరిపోతుంది. అలాగే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 1984 అక్టోబరు ఒకటో తేదీకి ముందు జన్మించిన వారై ఉండకూడదు. ఎస్సీఎస్టీ, వికలాంగ విద్యార్థులకు మాత్రం 1979 అక్టోబరు ఒకటో తేదీ వరకు సడలింపు ఉంది. జేఈఈ పరీక్షలకు ఇప్పటికే రెండు సార్లు హాజరైన విద్యార్థులు మళ్లీ రాసేందుకు అనుమతించరు. భారతీయ విద్యార్థులతో పాటు.. విదేశీలు సైతం అర్హులు.
పరీక్షా విధానం ఎలావుంటుంది?
జేఈఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పూర్తిగా కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమ్యాటిక్స్ సబ్జెక్టులకు సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నల రూపంలో ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఇందుకు సంబంధించిన సిలబస్ అన్ని ఐఐటీల అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్నాపత్రం హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఉంటుంది. ఐఐటీ సీట్లను ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
దరఖాస్తు ఎలా పొందాలి?
జేఈఈ ప్రవేశ పరీక్షకు అవసరమైన ధరఖాస్తును ఆయా ఐఐటీల నుంచి పొందవచ్చు. దరఖాస్తు పొందగోరే అభ్యర్థులు "ఛైర్మన్, ఐఐటి బాంబే, ముంబై-400 076" అనే పేరుతో నిర్ణయించిన రుసుంతో ఏదేనీ జాతీయ బ్యాంకులో తీసిన డీడీని జత చేసి పంపితే దరఖాస్తు పంపుతారు. ఇతర కేటగిరీలకు చెందిన విద్యార్థులు రూ.1000తోను, ఎస్సీఎస్టీ, వికలాంగ విద్యార్థులు రూ.500 విలువ చేసే డీడీలను జతచేయాల్సి ఉంటుంది. ఆన్‌లైను ద్వారా కూడా దరఖాస్తులు పొంది, ఆన్‌లైన్‌లోనే సమర్పించవచ్చు.
ఇతర వివరాలు..
ప్రవేశ పరీక్షకు అవసరమైన దరఖాస్తులను ఈనెల 19వ తేదీ నుంచి డిసెంబరు 24వ తేదీ వరకు అన్ని ఐఐటీ విక్రయకేంద్రాల్లో విక్రయిస్తారు. పోస్టు ద్వారా పొందగోరు విద్యార్థులకు మాత్రం డిసెంబరు 16వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 19వ తేదీ నుంచి డిసెంబరు 24వ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోగా సమర్పించాల్సి ఉంటుంది.
ఐఐటీలు ఎక్కడెక్కడ ఉన్నాయి?
ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి గౌహతి, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్‌పూర్, ఐఐటి మద్రాస్, ఐఐటి రూర్కీలలో ఉన్నాయి. ఆయా ఐఐటీలలో దరఖాస్తులు పొందవచ్చు.