Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పైలట్ కోర్సుతో ఉన్నత స్థాయికి ఎదిగే ఛాన్స్

పైలట్ కోర్సుతో ఉన్నత స్థాయికి ఎదిగే ఛాన్స్
ప్రారంభంలో సైనిక కార్యకలాపాలకు, ఆ తర్వాత ఉన్నత వర్గాలకు అందుబాటులోకి వచ్చిన విమాన సేవలు ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ సాధారణమైపోయింది. తక్కువ బడ్జెట్ విమాన సేవా సంస్థల రంగ ప్రవేశంతో ప్రస్తుతం ఎటు చూసినా విమాన సేవలు పెరుగుతున్నాయి.

వీటిలో ఛార్జీలు కూడా తక్కువగానే వసూలు చేస్తున్నందున ప్రయాణీకుల దృష్టి వీటిపై పడింది. దీంతో విమాన సేవా సంస్థలు కూడా పెద్ద సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పైలట్ కోర్సులకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది.

ప్రతి విమానానికి ఓ పైలట్, ఓ కోపైలట్ తప్పనిసరి. ఆకర్షణీయమైన జీతం, హోదా, ప్రపంచ దేశాల పర్యటన వంటి ఎన్నో ప్రత్యేకాంశాలు కలిగిన ఈ ఉద్యోగాన్ని కోరుకోని వారెవరుంటారు.

మీ కెరీర్ గురించి నిర్ణయం తీసుకునే ముందు దీనిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కోర్సుల్లో మూడు రకాలున్నాయి. ప్రాథమికంగా స్టూడెంట్ పైలట్, ఆ తర్వాత ప్రైవేట్ పైలట్, చివరగా కమర్షియల్ పైలట్ లైసెన్సులు ఉన్నాయి.

స్టూడెంట్ పైలట్ లైసెన్సు కోసం ఫ్లైయింగ్ క్లబ్‌లలో జరిగే ఎంపికలో పాలు పంచుకుని విజయం సాధించాలి. ఈ కోర్సులో విమాన ప్రయాణ నిబంధనలు, వాతావరణ స్థితిగతులు, విమానం నడపడం వంటి వాటిలో శిక్షణ పొంది ఉండాలి.

పదో తరగతి ఉత్తీర్ణులై, పదహారేళ్లు నిండిన వారు ఈ లైసెన్సుకు అర్హులు. వైద్య ధృవీకరణ, సెక్యూరిటీ క్లియరెన్స్, బ్యాంకు ష్యూరిటీలు తప్పనిసరిగా కలిగి ఉండాలి.

అలాగే ప్రైవేటు పైలట్ లైసెన్సు కోసం స్టూడెంట్ పైలట్ లైసెన్సు కలిగి, ఈ లైసెన్సుకు సంబంధించిన కోర్సులో చేరవచ్చు. శిక్షకుడితో పాటు ఈ కోర్సు చేస్తున్న వారు విమానంలో వెళ్లాల్సి ఉంటుంది.

గగనతలంలో సుమారు అరవై గంటల పాటు ఎగురుతూనే ఈ శిక్షణ అందుకోవాలి. అందులో ఇరవై గంటల పాటు మీరే విమానాన్ని నడపాల్సి ఉంటుంది. ఇంటర్ పూర్తి చేసి, పదిహేడేళ్లు పైబడిన వారు దీనికి అర్హులు కాగలరు.

ఈ లైసెన్సు అందుకున్న వారు చివరగా 250 గంటల పాటు గగన తలంపై విమానం నడిపే కమర్షియల్ పైలట్ లైసెన్సు కోర్సు చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సు పూర్తయిన వెంటనే అన్ని రకాల విమానాలు నడపవచ్చు.

ఇవి కాకుండా ఏవియేషన్ మూడేళ్ల గ్రాడ్యుయేషన్, నాలుగేళ్ల ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ టెక్నాలజీ, నాలుగేళ్లు ఎయిర్‌ బేస్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu