కుప్పలుగా వస్తున్న బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్లు నిరుద్యోగ యువతకు ఎడారిలో ఒయాసిస్సుల్లా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో మీలోని పట్టుదల, కార్యదీక్షలే పెట్టుబడులుగా మీరు ప్రయత్నించగల్గితే బ్యాంక్ ఉద్యోగాన్ని సాధించడం అంత కష్టమేమీ కాదు.
ఎందుకంటే వివిధ రకాల బ్యాంకులు వేలల్లో ఖాళీల భర్తీ చేపడుతున్నా ఆయా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల సంఖ్య లక్షల్లో ఉంటోంది. అందుకే పైన చెప్పినట్టు ఆషామాషీగా కాక పట్టుదలగా, తెలివిగా ప్రిపేర్ కాగల్గితే బ్యాంక్ ఉద్యోగం అనే మీకల సాకారమయ్యే అవకాశం ఉంది.
రానున్న నెలల్లో అనేక బ్యాంకులు భారీ సంఖ్యలో ప్రొబేషనరీ అధికారులు, క్లర్క్ సంబంధిత పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్యానిస్తున్నాయి. వీటిలో కొన్ని బ్యాంకుల నోటిఫికేషన్లు ఇదివరకే వెలువడగా, మరికొన్ని వెలువరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. నోటిఫికేషన్ వెలువరించిన బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం దాదాపుగా ఈ నెలతో ముగియనుంది.
ఈ సమయంలో చాలామంది అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పనిలో నిమగ్నమై ఉంటారు. అలాంటి వారికోసం కొన్ని సూచనలు...
ఒకేసమయంలో అనేక బ్యాంక్‌లు నోటిఫికేషన్లు వెలువరించినా అన్ని బ్యాంక్‌లకు సంబంధించిన పరీక్షా విధానం, సిలబస్ దాదాపు ఒకేలాగా ఉంటోంది. అందుకే అభ్యర్ధులు ఈ విషయంలో కాస్త తెలివిగా వ్యవహరించాలి. మీరు దరఖాస్తు చేసిన బ్యాంకుల సంఖ్యను బట్టి వాటిలో సిలబస్ సారూప్యమున్న వాటిని ఎంచుకోవాలి.
అలాంటి బ్యాంక్ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షకు సంబంధించి ప్రిపేర్ అయ్యే సమయంలో సారూప్యమున్న సిలబస్‌ను ఒకదగ్గరగా చేసుకుని చదవాలి. దీని వల్ల సమయం పొదుపు చేయడంతోపాటు అనవసరమైన తికమక మనదరి చేరే అవకాశం తగ్గుతుంది. అలాగే సిలబస్‌కు సంబంధించి అన్ని రకాల ఆఫ్షన్స్కు సమాన స్థాయిలో ప్రాముఖ్యానివ్వాలి.
సులభంగా ఉందని ఒక్కదాన్నే పట్టుకు వ్రేళాడడం, కష్టంగా ఉందని కొన్ని ఛాప్టర్స్ను అసలే తాకకుండా మానేయడం రెండూ సరికాదు. పరీక్ష బాగా రాయాలంటే అన్ని రకాల పాఠ్యాంశాలకు సమాన ప్రాముఖ్యానివ్వడం తప్పనిసరి. పరీక్షకు ప్రిపేర్ అయ్యేవారు రోజులో ఓ నిర్ణీత సమయంలోనే మీ ప్రిపరేషన్ ఉండేలా చూచుకోండి.
దీనివల్ల ఆ సమయానికి మీ మనసు, మెదడు చదవడానికి సిద్ధంగా ఉంటాయి. దీనివల్ల చదివినదానిని మీ మెదడు త్వరగా గ్రహిస్తుంది. అలాగే బ్యాంక్ సంబంధ ఉద్యోగాల్లో అడిగే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలకోసం ప్రిపేర్ అయ్యే సమయంలో వర్తమానానికి సంబంధించిన విషయాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
దీనికోసం ఏదేని రెండు వార్తాపత్రికలను ప్రతిరోజూ క్షుణంగా చదవడం అలవాటు చేసుకోవాలి. పైన పేర్కొన్న విధంగా మీరు దరఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబంధించిన సిలబస్‌ను క్రమంగా చదువుతూ అందులోని ముఖ్యాంశాలను నోట్స్‌గా రాసుకుంటూ ప్రిపరేషన్ సాగించండి.
ఈ నోట్స్ పరీక్ష దగ్గరపడే సమయంలో మీ రివిజన్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. చివరగా ఎలాంటి టెన్షన్ లేకుండా చక్కగా పరీక్ష రాయగల్గితే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు.