ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యావ్యవస్థలో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా విద్యా వ్యవస్థ వ్యాపారంగా మారింది. దీన్ని అడ్డుపెట్టుకొని పలు కోచింగ్ సెంటర్లు కోట్లాది రూపాయల మేరకు ఆదాయాన్ని అర్జిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించనున్నట్టు ప్రకటించింది. అయితే వీటి ఏర్పాటుకు ఉన్నత విద్యా ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక స్థితిగతులు, తదితర అంశాలు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలు విద్యా సంస్థలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి. వీటిలో రిలయన్స్, సత్యం, జీఎంఆర్ వంటి సంస్థలు ముందువరుసలో ఉన్నాయి. దేశంలోని మెట్రో నగరాల్లో ఐటీ, సాఫ్ట్వేర్ వంటి కోర్సులకు ఇస్తున్న శిక్షణ వల్ల ఏడా పది వేల కోట్ల రూపాయల మేరకు వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా.
దీన్ని అందిపుచ్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో కార్పొరేట్ సంస్థలు విద్యాలయాల ఏర్పాటుపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఉన్నత విద్యలోకి కార్పొరేట్ సంస్థలు ప్రవేశించినట్టయితే విద్యా వ్యవస్థ పూర్తిగా వాణిజ్య మయమవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.