సౌదీ ప్రభుత్వం కొత్తగా ఐదు వేల మంది విదేశీ వైద్యులను రిక్రూట్ చేసేందుకు నిర్ణయించింది. భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌తో సహా ఇతర ఆసియా దేశాలకు చెందిన వైద్యులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా సౌదీలో కొత్తగా నెలకొల్పనున్న అధునాతన సౌకర్యాలతో కూడిన ఆస్పత్రులకు అవసరమైన ఇతర సహాయక సిబ్బందిని కూడా ఎంపిక చేయనుంది.
దీనిపై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ ఖలీద్ అల్ మిర్గాలని మాట్లాడుతూ తమ దేశంలో కొత్తగా ప్రారంభించనున్న 43 ఆస్పత్రులకు అవసరమైన సిబ్బందిని విదేశాలకు చెందిన సిబ్బందితో భర్తీ చేయనున్నట్టు చెప్పారు. సౌదీలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను ఈ రిక్రూట్‌మెంట్ చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందుకోసం తమ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసిందన్నారు.
ఇందులో వైద్య నిపుణులు కూడా ఉన్నట్టు చెప్పారు. అర్హులైన అభ్యర్థులకు తొలుత మౌఖిక పరీక్ష నిర్వహిస్తామన్నారు. కొత్తగా ప్రారంభించనున్న 43 ఆస్పత్రుల్లో ఒక్కో హాస్పిటల్‍లో 50 నుంచి 400 పడకల సౌకర్యం ఉందన్నారు. ఈ ఆస్పత్రులను రియాధ్, అసిర్, జిజాన్, హైల్, తబుక్, ఆల్ ఖస్సిమ్, అల్ జౌఫ్, అల్ ఖురయత్, మక్కా, మదీనా, తైఫ్, ఖున్ఫుదాలలో నిర్మించినట్టు ఆయన వెల్లడించారు.