చెరకు, చక్కెర పుట్టినిల్లుగా ప్రస్థానం సాగించిన స్థితినుంచి, ప్రపంచంలోనే రెండో అతి పెద్ద చెరకు ఉత్పత్తిదారుగా ప్రస్తుతం ఆవిర్భవించిన భారత్ నేడు ప్రపంచ చెరకు మరియు దాని అనుబంధ పరిశ్రమ విభాగంలో కీలకపాత్రను పోషిస్తోంది. భారతీయ చక్కెర పరిశ్రమ నేడు దాదాపు వంద కోట్లమంది వినియోగదారులతో అలరారుతోంది.
భారత్‌లో ప్రస్తుతం 4 కోట్ల 50 లక్షలమంది చెరకు ఉత్పత్తిదారులు ఉంటున్నారు. దేశంలోని గ్రామీణ కార్మికుల్లో చాలాభాగం ఈ పరిశ్రమ మీదే ఆధారపడి ఉండటం గమనార్హం. భారత్‌లో జౌళి పరిశ్రమ తర్వాత చెరకు రెండో అతిపెద్ద వ్యావసాయిక పరిశ్రమగా నిలిచింది.
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జూలై 25 నుంచి 27 దాకా సుగరాసియా 2008 అంతర్జాతీయ ప్రదర్శన జరగనుంది. భారత్‌లోనూ, ప్రపంచంలోనూ లభ్యమవుతున్న అధునాతన టెక్నాలజీ మరియు సామగ్రికి ఈ ప్రదర్శన ఒక అద్భుతమైన వేదికను అందిస్తోంది. ఉత్పత్తి దారుల, విక్రేతల సమావేశ కూడలిగా నిలిచే ఈ ప్రదర్శన వివిధ దేశాల ఎగుమతిదారులకు నాణ్యమైన చక్కెర రకాలను రుచి చూపించనుంది.
పంపిణీకి, ఎథనాల్ ప్రక్రియకు, విద్యుదుత్పత్తికి, గ్రీన్ హౌస్ వాయువుల తగ్గింపుకు సంబంధించిన పలు నూతన టెక్నాలజీల గురించిన సమాచారాన్ని ఈ సుగరాసియా 2008 ప్రదర్శన అందించనుంది. పైగా, నూతన చెరకు రకాలు, నూతన పంట పద్ధతులు, చెరకును శుభ్రపర్చడం వంటి అంశాలకు సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ లభ్యం కానుంది.
చెరకు పంట, చక్కెర తయారీలో సహకరించే కొత్త సామగ్రిని కూడా ఈ ప్రదర్శనలో ప్రదర్శించనున్నారు. చక్కెర పరిశ్రమ, యాంత్రిక చెరకు పంట, నూతన పెట్రో సరకుగా చక్కెర, చక్కెర పరిశ్రమలో సిడిఎమ్ మరియు కార్బన్ క్రెడిట్ అవకాశాలు, చక్కెర కర్మాగారాల్లో ఉత్పాదకత మరియు లాభదాయకత పెంపుదల వంచి పలు అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
చక్కెర పరిశ్రమలోని దిగ్గజాలు ఈ ప్రదర్శనకు మద్దతిచ్చాయి. సుగర్ ఆర్గనైజేషన్, ఇండియన్ సుగర్ మిల్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కో-ఆప్ సుగర్ ఫ్యాక్టరీస్ లిమిటెడ్, ఆల్ ఇండియా డిస్టిల్లర్స్ అసోసియేషన్, ది ఎథనాల్ మాన్యుఫాక్చరర్ల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, చక్కెర మరియు సమీకృత టెక్నాలజీలలో అంతర్జాతీయ వృత్తినిపుణుల సమితి వంటి సుప్రసిద్ధ సంస్థలు ఈ సుగరాసియా 2008 ప్రదర్శనకు మద్దతునిస్తున్నాయి.
ఈ ప్రదర్శన నిర్వాహకులైన నెక్సెజెన్ ఎగ్జిబిషన్స్ డైరెక్టర్ వికె బన్సాల్ ఈ సందర్భంగా మాట్లాడారు. చక్కెర, సంబంధిత ఉత్పత్తుల తయారీదార్లు, సర్వీస్ ప్రొవైడర్లు, వినియోగదారులు, ఎగుమతిదారులు, దిగుమతిదారులకు చర్చా సమావేశంగా ఈ ప్రదర్శన నిలుస్తుందని బన్సాల్ తెలిపారు.
భారత చక్కెర పరిశ్రమతో వ్యాపార సంబంధాలు కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ సందర్శకులతో సంప్రదింపులు జరపడానికి ఈ ప్రదర్శన మంచి అవకాశాన్ని ఇస్తుందని ఈ కార్యక్రమ నిర్వాహకులు చెప్పారు.