పండుగల సెంటిమెంట్ సరిగ్గా పనిచేయడంతో అక్టోబర్ నెల వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. ఈ నెలలో దేశీయ కార్ల విక్రయాలు 37.99 శాతం వృద్ధి చెంది 1,82,992 యూనిట్లను నమోదు చేసుకున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ఈ విక్రయాలు 1,32,615 యూనిట్లుగా ఉన్నట్లు భారతీయ ఆటోమొబైల్ తయారీ దారుల సంఘం (ఎస్ఐఏఎమ్) తెలిపింది.
ఈ నెలలో మోటార్ సైకిళ్ళ అమ్మకాలు 43.31శాతం వృద్ధితో 6,11,828 యూనిట్ల నుంచి 8,76,810 యూనిట్లకు పెరిగాయి. అలాగే అక్టోబర్ నెలలో ద్విచక్ర వాహన విక్రయాలు 50.38 శాతం వృద్ధి చెంది 11,27,82 యూనిట్లను నమోదు చేసుకున్నాయి.
గతేడాది ఇదే సమయానికి ఈ విక్రయాలు 7,49,965 యూనిట్లుగా ఉన్నాయి. ఇకపోతే వాణిజ్య వాహనాలు 18.17 శాతం వృద్ధితో 43,018 యూనిట్ల నుంచి 50,835 యూనిట్లకు పెరిగాయి. కాగా.. అన్ని విభాగాల వాహనాలు 45.93 శాతం వృద్ధితో 10,00,953 యూనిట్ల నుంచి 14,60,655 యునిట్లకు పెరిగినట్లు ఎస్ఐఏఎమ్ వెల్లడించింది.