ఇపుడు నగరాలు, పట్టణాల్లో ఉండేవారు రెండు సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే, టెలికాం టారిఫ్‌లు పెరిగిన నేపథ్యంలో రెండు సిమ్ కార్డులను కొనసాగించడం ఆర్థికంగా కష్టంగా మారింది. కొందరైతే రెండో సిమ్ కార్డును పక్కనపడేస్తున్నారు. అలా రద్దయిన సిమ్ కార్డును మరొకరికి టెలికాం కంపెనీలు కేటాయించడం జరుగుతుంది. అయితే, ఆ సిమ్ కార్డు కూడా మీ పేరుమీదే కొనసాగాలంటే ఇకపై కేవలం రూ.20 రీఛార్జి చేసుకుంటే సరిపోతుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) తీసుకొచ్చిన ఈ నిబంధన.. ఎంతోమంది డ్యూయల్ సిమ్ వినియోగదారులకు శుభవార్తగా చెప్పొచ్చు.
ఒక సిమ్ కార్డుకు కాల్స్, ఎస్సెమ్మెస్లు, డేటా వాడకుండా ఎటువంటి యాక్టివ్ రీఛార్జి ప్లాన్ లేకుండా 90 రోజులకు మించి సిమ్ కార్డును పక్కన పడేస్తే అది డిస్కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు మీ టెలికాం ఆపరేటర్ ఆ సిమ్ కార్డును మీ పేరు నుంచి డీరిజిస్టర్ చేసి వేరొకరికి కేటాయిస్తారు. ఇలా మీ పేరుమీదే సిమ్ కార్డు కొనసాగాలంటే రూ.20 రీఛార్జి చేసుకుంటే సరిపోతుంది.
మీరు 90 రోజుల పాటు మీ సిమ్ కార్డును వాడకపోతే.. మీ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ నుంచి రూ.20 కట్ అయ్యి మీకు 30 రోజుల గడువు లభిస్తుంది. ఇలా ప్రతి నెలా రూ.20తో రీఛార్జి చేసుకుంటే మీ సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.
ఒకవేళ ఆ నెలలో ఏదైనా కారణంతో మీ ఖాతాలో రూ.20తో రీఛార్జి చేసుకోకపోతే 15 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. ఆలోపు మీ ఖాతాలో బ్యాలెన్స్ మెయింటెయిన్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీ సిమ్ కార్డును కోల్పోవాల్సి వస్తుంది. వాస్తవానికి ట్రాయ్ తీసుకొచ్చిన రూల్ కొత్తదేమీ కాదు. ఈ ఆటోమేటిక్ నంబర్ రిటెన్షన్ స్కీమ్‌ను ఎప్పుడి నుంచో ఉంది. దీనిపై సరైన ప్రచారం లేకపోవడంతో చాలా మంది రెండో సిమ్‌ను తమ పేరు మీద కొనసాగించేందుకు ప్రతినెల పెద్ద మొత్తం పెట్టి రీఛార్జి చేసుకుంటున్నారు.
ఈ సదుపాయం కేవలం మీ సిన్కార్డును మీ పేరు మీద యాక్టివ్ గా ఉంచడానికి ఉద్దేశించిన రీఛార్జి మొత్తం మాత్రమే. ఆ నంబర్ తో ఇన్కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ చేసుకోవాలంటే మాత్రం ఆయా టెలికాం కంపెనీలు నిర్ధేశించిన ప్లాన్ల ప్రకారం రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.