కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచి దేశ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ తరహా చెల్లింపులకు దేశ వ్యాప్తంగా స్వల్ప కాలంలోనే మంచి ఆదరణ లభించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో యూపీఐ చెల్లింపుల విధానాన్ని మరింతగా విస్తరించేలా భారత రిజర్వు బ్యాంకు జనవరి ఒకటో తేదీ నుంచి కొన్ని కీలక మార్పులు చేసి అమల్లోకి తీసుకొచ్చింది.
ఈ కొత్త మార్పుల మేరకు.. యూపీఐ ద్వారా చేసే ఆటోమేటిక్ చెల్లింపుల పరిమితిని జనవరి నుంచి లక్ష రూపాయలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గతంలో ప్రకటించింది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో పాటు కొన్ని విభాగాలకు ఈ చెల్లింపు పరిమితి రూ.15,000గా ఉంది. బీమా ప్రీమియం చెల్లింపులు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులకూ ఈ పరిమితి పెంపు వర్తిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. కార్డులు, ప్రీపెయిడ్ చెల్లింపు పద్ధతులు, యూపీఐలపై ఇ-మ్యాండేట్‌లు/స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్‌ల ప్రాసెసింగ్‌లకు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్‌ఏ) సడలింపు ఉంటుంది.
ఇప్పటివరకు ఆస్పత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ ద్వారా ఒకసారి ఒక లక్ష వరకు చెల్లించేందుకు అనుమతి ఉండేది. ఇకపై దీన్ని రూ.ఐదు లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గతంలో ప్రకటించింది. ఫలితంగా ఆయా చోట్ల యూపీఐ ద్వారా భారీ మొత్తం చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు లభిస్తుంది. యేడాది కంటే ఎక్కువ సమయం నుంచి యూపీఐ ఐడీలు, నంబర్లు వినియోగంలో లేకపోతే.. అవన్నీ డియాక్టివేట్ కానున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ గత నవంబర్‌లోనే ఉత్తర్వులు జారీ చేసింది.
డిజిటల్ వాలెట్లు లేదా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించి చేసే యూపీఐ చెల్లింపులపై 1.1 శాతం ఇంటర్‌ఛేంజ్ ఛార్జీ వర్తించనుంది. రూ.2,000 పైన చేసే మర్చంట్ లావాదేవీలపై మాత్రమే ఈ తరహా ఛార్జీలను విధిస్తారు. బ్యాంక్ ఖాతా నుంచి బ్యాంక్ ఖాతాకు లేదా సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.
ఇకపై యూపీఐ యాప్‌ల నుంచి ఎవరికి చెల్లింపులు చేసినా.. వారి బ్యాంకు ఖాతాలో ఉండే పూర్తి పేరు తెరపై కనిపిస్తుంది. తప్పుడు లావాదేవీలకు అరికట్టేందుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆర్‌బీఐ జపాన్‌కు చెందిన హిటాచీ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకొంది. దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది. ఫలితంగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. ఈ తరహా ఏటీఎంలు దశలవారీగా దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.
త్వరలో యూపీఐ ట్యాప్ అండ్ పే విధానాన్ని కూడా అందుబాటులో తీసుకొస్తామని ఎన్‌పీసీఐ ఆ మధ్య ప్రకటించింది. అంటే క్యూఆర్ కోడ్ స్కానింగ్ లేదా ఫోన్ నంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే చెల్లింపులు చేసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. అయితే, దీనికి ఫోనులో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్ అందుబాటులో ఉండాలి.
యూపీఐ ద్వారా కొత్తవారికి చేసే తొలి చెల్లింపు మొత్తం రూ.2,000 దాటితే.. లావాదేవీ పూర్తి కావడానికి నాలుగు గంటల సమయం పట్టేలా మార్పులు చేసే యోచనలో ఎన్‌పీసీఐ ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మోసపూరిత లావాదేవీలను అరికట్టడంలో భాగంగానే ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.