దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) సర్వర్ డౌన్ అయింది. దీంతో ఆ బ్యాంకు సేవల్లో అంతరాయం ఏర్పడినట్టు ప్రచారం జరుగుతోంది. యూపీఐ లావాదేవీలు, నెట్ బ్యాంకింగ్, అధికారిక యోనో యాప్.. వినియోగంలో సమస్యలు తలెత్తుతున్నట్లు పలువురు కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా తమ అసౌకర్యాన్ని తెలియజేశారు.
ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ ఇండియా సైతం ఎస్‌బీఐ కస్టమర్లు సమస్యను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. సోమవారం ఉదయం దాదాపు 9 గంటల నుంచి కస్టమర్ల ఫిర్యాదులు ప్రారంభమైనట్లు తెలిపింది. కొంత మంది మాత్రం ఆదివారం నుంచే తాము సమస్య ఎదుర్కొంటున్నట్లు ట్విటర్‌లో రాసుకొచ్చారు. మరికొందరైతే రెండు, మూడు రోజుల నుంచి తాము ఎస్‌బీఐ ఆన్‌లైన్ లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.
ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఎస్‌బీఐ తమ ఆన్‌లైన్ సేవలకు ఏప్రిల్ ఒకటో తేదీన స్వల్ప విరామం ఇచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 4:45 వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని ట్విటర్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి ఎస్.బి.ఐ సేవలకు అంతరాయం ఏర్పడుతున్నాయి.
మరోవైపు, సోమవారం బ్యాంకు సేవల అంతరాయంపై ఎస్‌బీఐ ఉన్నతాధికారులు మాత్రం స్పందించలేదు. దీనిపై కస్టమర్లు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు సేవల్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తారని ప్రశ్నిస్తున్నారు.