జన్‌ధన్ ఖాతాల వల్లే బాదాల్సి వస్తోంది... నాలుగుకు మించి ఉపయోగించరాదు : అరుంధతీ
జన్‌ధన్ ఖాతాల నిర్వహణ భారంగా మారిందని, అందువల్లే ఖాతాదారులపై అదనపు చార్జీల భారం మోపాల్సి వస్తోందని ఎస్.బి.ఐ ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. ఖాతాల్లో కనీస నిల్వలేని పక్షంలో పెనాల్టీ విధిస్
జన్‌ధన్ ఖాతాల నిర్వహణ భారంగా మారిందని, అందువల్లే ఖాతాదారులపై అదనపు చార్జీల భారం మోపాల్సి వస్తోందని ఎస్.బి.ఐ ఛైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. ఖాతాల్లో కనీస నిల్వలేని పక్షంలో పెనాల్టీ విధిస్తామని ఎస్‌బిఐ గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ ఏమాత్రం చలించలేదు. పైగా తన చర్యను గట్టిగా సమర్థించుకుంది.
ప్రభుత్వం పురమాయింపుపై లక్షల సంఖ్యలో తాము పేదల కోసం జన్‌ధన్ ఖాతాలను తెరవాల్సి వచ్చిందని, ఈ ఖర్చులన్నీ భరించాలంటే, ఇతర ఖాతాదారులు తమ ఖాతాల్లో తాము సూచించిన విధంగా కనీస నిల్వలను ఉంచాల్సిందేనని ఎస్‌బిఐ పేర్కొంది. లేదంటే జరిమానా వసూలు చేస్తామని పేర్కొంది. పెనాల్టీ ప్రతిపాదన ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రభుత్వం నుంచి తమకు ఇంతవరకు ఎలాంటి అభ్యర్థన అందలేదని, అందినప్పుడు దానిపై నిర్ణయం తీసుకుంటామని ఎస్‌బిఐ తెలిపింది. జన్‌ధన్ ఖాతాలకు కనీస ఖాతా నిబంధన వర్తించదని కూడా పేర్కొంది.
అయితే జన్‌ధన్ పేరుతో ప్రభుత్వ పురమాయింపుపై దాదాపు 11 కోట్ల ఖాతాలను తెరిచినట్టు ఎస్‌బిఎ వెల్లడించింది. ఈ ఖాతాలకు కనీస నగదు వంటి నిబంధనలేమీ వర్తించవు. ఖాతాలో పైసా జమచేయకున్నా దానిని బ్యాంకు కొనసాగించాల్సిందే. ఇలాంటి ఖాతాల వల్ల తమపై ఆర్థిక భారం పెరుగుతోందని ఎస్‌బిఐ చెబుతోంది. ఈ భారాన్ని తట్టుకునేందుకు చార్జీలు విధించకతప్పదని సమర్థించుకుంటున్నది. చాలా ఆలోచించిన తర్వాతనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు.
అంతేకాకుండా, నెలకు నాలుగు సార్లకంటే ఎక్కువగా ఏటీఎంను వినియోగించాల్సిన అవసరం రాదని చెప్పుకొచ్చారు. ఖాతాదారులు తమ లావాదేవీల కోసం తప్పనిసరిగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో మొబైల్, ఇంటర్నెట్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఓ గృహస్తుడికి నెలకు నాలుగు సార్లకంటే ఎక్కువగా ఏటీఎంను ఉపయోగించాల్సినంత అవసరం ఏముంటుందని ఆమె ప్రశ్నించారు. ఇటువంటి అవసరం వ్యాపారులకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి ఖాతాదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోక తప్పదని సూచించారు.