ప్రీమియం బైక్‌ల దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మోడళ్లకు చెందిన 2,36,966 బైక్‌లను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిలో మెటియర్ 350, క్లాసిక్ 350, బుల్లెట్ 350 మోడళ్లకు చెందిన బైక్‌లు ఉన్నాయి. భారత్, థాయ్‌లాండ్, మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. మొత్తం ఏడు దేశాల నుంచి బైక్‌లను రీకాల్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.
ఇంజిన్‌లోని ఇగ్నిషన్ కాయిల్‌లో లోపాన్ని గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. దీనివల్ల ఇంజిన్ మిస్‌ఫైర్, పనితీరు తగ్గడం, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వంటి సమస్యలు చాలా అరుదుగా తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. ఈ లోపాలున్న కాయిల్ తయారీలో ఉపయోగించిన వస్తువులను ఓ సప్లయర్ దగ్గరి నుంచి తీసుకున్నామని తెలిపింది. వాటిల్లో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు అంతర్గతంగా జరిపిన పరీక్షల్లో తేలిందని పేర్కొంది. డిసెంబరు 2020, ఏప్రిల్ 2021 మధ్య తయారైన బైక్‌లలోనే ఈ సమస్య ఉన్నట్లు గుర్తించామని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే ఆయా బైక్‌లను రీకాల్ చేసి లోపాల్ని సవరిస్తున్నట్లు సంస్థ వివరించింది. వీటిలో కేవలం ఒక 10 శాతం బైక్‌లకు మాత్రమే కాయిల్ రీప్లేస్‌మెంట్ అవసరం అయి ఉండొచ్చని పేర్కొంది.