రిలయన్స్ ఇండస్ట్రీసి ఇపుడు బీమా రంగంలోకి అడుగుపెట్టనుంది. జియో ఫైనాన్షియల్ సర్వీస్ ఈ సేవలను అందించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ 46వ వార్షిక సాధారణ సమావేశంలో (రిల్ ఏజీఎం) ఆ సంస్థ అధిపతి ముఖేశ్ అంబానీ వెల్లడించారు. ఏజీఎంలో ఆయన మాట్లాడుతూ, "జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బీమా విభాగంలోకి అడుగు పెడుతుంది. సాధారణ బీమా, జీవిత బీమా, ఆరోగ్య బీమా సేవలను అందిస్తుంది. అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో డిజిటల్ వేదికగా ఈ సేవలను అందించనున్నాం" అని తెలిపారు.
"ఆగస్టు 21న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. ఒక్కో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరుకుగానూ ఒక్కో జేఎఫ్‌ఎస్ షేరు కేటాయించాం. ఇదీ వాటాదారులకు మినీ బోనస్‌గా భావిస్తున్నాం" అని అంబానీ అన్నారు. ఇది అత్యంత మూలధనంతో కూడుకున్న వ్యాపారమని, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నికర విలువ రూ.1.2 లక్షల కోట్లని తెలిపారు. జియో, రిలయన్స్ రిటైల్ తరహాలో జియో ఫైనాన్షియల్ వ్యాపారం సైతం రాణిస్తుందని చెప్పారు.