ఆర్థిక సంక్షోభంలో పాక్... దారుణంగా పడిపోయిన మారకం విలువ
చిరకాల మిత్రదేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకోనుంది. ఆ దేశ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఫలితంగా విదేశీ ద్రవ్య నిల్వలు 12.9 బిలియన్ డాలర్లకు చేరాయి.
చిరకాల మిత్రదేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకోనుంది. ఆ దేశ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఫలితంగా విదేశీ ద్రవ్య నిల్వలు 12.9 బిలియన్ డాలర్లకు చేరాయి. పాకిస్థాన్‌లో రోజురోజుకూ దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆ దేశ సెంట్రల్ బ్యాంకు చేపట్టిన ప్రయత్నాలు కూడా ఏమాత్రం ఫలించడం లేదు.
ఫలితంగా మంగళవారం పాకిస్థాన్ రూపాయి మారకం విలువ మరింతగా దిగజారింది. సాయంత్రం 4:57 గంటలకు కరాచీలో ఆ దేశ రూపాయి మారకం విలువ దారుణంగా క్షీణించింది. 1.9 శాతం క్షీణించి డాలర్‌కు 109.5 రూపాయలకు చేరుకుంది. శుక్రవారం తర్వాత ప్రపంచవ్యాప్తంగా మారకం విలువ ఇంత దారుణంగా క్షీణించడం ఇదే తొలిసారి.
రూపాయి మారకం విలువ పడిపోవడంపై పాక్ ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి వకార్ మసూద్ మాట్లాడుతూ ‘ఇది అసాధారణం’ అని పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పడిపోతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకునేందుకు ప్రభుత్వం గతనెలలో 2.5 బిలియన్ డాలర్లు అప్పు చేసిందని చెప్పారు.