కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల కేపీ ఉల్లి రైతుల పోరాటానికి సారథ్యం వహిస్తున్న భారతీయ రైతు సంఘాల సమాఖ్య నేతలు హర్షం వ్యక్తం చేశారు. కేపీ ఉల్లిపై నిషేధం తొలగించి రైతులను ఆదుకోవాలని కోరుతూ గత నవంబర్‌లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు లేఖ రాయడం జరిగింది.
ఆ లేఖపై తక్షణమే చర్యలు తీసుకోవలసిందిగా మంత్రి డైరెక్టర్ జనరల్ ఫారిన్ ట్రేడ్‌ను కోరారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిషేధం తక్షణ తొలగింపు కోరుతూ వైఎస్సార్సీ ఎంపీలు ఢిల్లీలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్‌ను కలిసి ఆయనపై వత్తిడి తీసుకురావడం జరిగింది. ఎట్టకేలకు నిషేధం ఎత్తివేయడానికి మంత్రి అంగీకరించి ఆ విషయాన్ని రాజ్యసభలో ప్రకటించడం జరిగింది.
కేపీ ఉల్లి రైతులకు అండగా నిలబడి ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు నిర్విరామంగా కృషి చేసినందుకు రైతు సంఘాల నేతలు బుధవారం ఢిల్లీలో వైఎస్సారీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి, లోక్‌సభా పక్ష నేత పీ.వీ. మిథున్ రెడ్డిని స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. రైతు సంక్షేమమే మా లక్ష్యం. అదే మా విధానం అని ఈ సందర్భంగా వి.విజయసాయి రెడ్డి పునరుద్ఘాటించారు.