క్రెడిట్ కార్డులపై లక్షకు పైన బిల్లు చేస్తే అంతే సంగతులు: బ్యాంకు ఖాతాలపై ఐటీ కన్ను
పెద్దనోట్ల రద్దు సంక్షోభం కాస్త చల్లబడిన సంకేతాలు వెలువడగానే బ్యాంకులలో దాగిన నల్లధనం నిరోధానికి కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. దీంట్లోభాగంగానే, దేశంలో వార్షికంగా పది లక్షల రూపాయల పైన నగదు డిపాజిట్లు చేసిన వారి వివరాలను తెలపాలంటూ ఆదాయపు పన్ను శ
పెద్దనోట్ల రద్దు సంక్షోభం కాస్త చల్లబడిన సంకేతాలు వెలువడగానే బ్యాంకులలో దాగిన నల్లధనం నిరోధానికి కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. దీంట్లోభాగంగానే, దేశంలో వార్షికంగా పది లక్షల రూపాయల పైన నగదు డిపాజిట్లు చేసిన వారి వివరాలను తెలపాలంటూ ఆదాయపు పన్ను శాఖ బ్యాంకులకు సూచించింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 మధ్య ఒక వ్యక్తి ఒక అకౌంట్ లేదా అంతకుమించి అకౌంట్లలో రూ.2.5 లక్షలు లేదా ఆపైన డిపాజిట్ చేస్తే... ఆ వివరాలను తమకు అందించాలని నవంబర్‌లో తాను జారీ చేసిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని కూడా బ్యాంకింగ్‌కు తన తాజా నోటిఫికేషన్‌లో సూచించింది. కరెంట్ అకౌంట్ విషయంలో పరిమితి మొత్తం రూ.12.50 లక్షలు ఆపైన కావడం గమనార్హం. కార్పొరేట్ కంపెనీ, సహకార బ్యాంకులకూ తాజా నిబంధన వర్తిస్తుందని తెలిపింది.
అంతకంటే ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులపై బాంబులాటి వార్తను ఐటీ శాఖ సంధించింది. సంవత్సరానికి లక్ష రూపాయలు ఆ పైన క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారి వివరాలను తనకు తెలియజేయాల్సిందిగా ఆదాయ పన్ను శాఖ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖలను కోరింది. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల (సీబీడీటీ) కేంద్ర బోర్డ్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతోపాటు వివరాలను అందించడానికి ఒక ఈ–ప్లాట్‌ఫామ్‌ను ప్రతిపాదించింది.
కాగా, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొన్ని సహకార బ్యాంకుల అకౌంట్లలో తీవ్రమైన వైరుధ్యాలు, అవకతవకలు కనిపించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి ఆదాయపు పన్ను శాఖ ఒక లేఖ రాసింది. తమ విచారణలో ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు కనుగొన్నట్లు వివరించింది. ముంబై. పూనేల్లో ఇందుకు సంబంధించి రూ.113 కోట్ల అవకతవకలను గుర్తించినట్లు ఐటీ శాఖ తన విశ్లేషణా పత్రాల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ తరహా ఘటనలపై విశ్లేషణాత్మక నివేదికలను ఆర్థికశాఖ, ఆర్‌బీఐలకు ఐటీ శాఖ సమర్పించిందనీ, చర్యలకు విజ్ఞప్తి చేసిందనీ అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
అంటే పదిలక్షల పైన డిపాజిట్లు చేసినవారిలో, లక్షరూపాయలకు పైబడి ఒక సంవత్సరంలో క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు చేసిన వారిలో నల్లధన స్వాములు ఎవరు అనేది ప్రభుత్వం తేల్చనుందన్నమాట.