కొత్త యేడాదిలో అనేక రకాల వస్తువులు ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల ధరలు పది శాతం మేరకు పెరగనున్నాయి. కాపర్, అల్యూమినియం, స్టీల్‌తోపాటు రవాణా ఛార్జీలు కూడా పెరగడంతో ఈ పెంపు తప్పకపోవచ్చని కంపెనీలు చెబుతున్నాయి.
అంతేకాకుండా టీవీ పానెళ్ల ధరలు దాదాపు రెండింతలు పెరిగాయని, ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్లాస్టిక్ కూడా భారమైందని తయారీదారులు వాపోతున్నారు. జనవరి నుంచి ధరలు పెంచడం ఖాయమని ఇప్పటికే ఎల్జీ, పానసోనిక్, థామ్సన్‌లాంటి కంపెనీలు స్పష్టం చేశాయి. అయితే సోనీ మాత్రం ధరలపై ఇంకా సమీక్ష జరుపుతోంది.
విడి భాగాల ధరలు పెరగడం వల్ల భవిష్యత్తులో తమ ఉత్పత్తుల తయారీ ఖర్చు కూడా పెరుగుతుందని, అందువల్ల జనవరిలో ధరల్లో 6-7 శాతం పెరుగుదల తప్పదని పానసోనిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ చెప్పారు. ఈ ధరలు ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ముగిసే నాటికి 10-11 శాతానికి పెరగవచ్చనీ అభిప్రాయపడ్డారు.
అటు ఎల్జీ ఇండియా కూడా జనవరి 1 నుంచి తమ కంపెనీ అన్ని ఉత్పత్తులపై 7 నుంచి 8 శాతం ధరలు పెంచడానికి సిద్ధమవుతున్నట్లు ఆ సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు తెలిపారు. అటు సోనీ మాత్రం ధరల పెంపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ చెప్పారు.