ఇటీవలనే జరిగిన ఇండో-కెనడియన్ బిజినెస్ చాంబర్ (ఐసీబీసీ) జాతీయ వార్షిక సదస్సులో సస్టెయినబల్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఇండియా, కెనడా నడుమ అతున్నత సహకారం కావాల్సిందిగా ఇరు దేశాల ప్రభుత్వ నాయకులు, పరిశ్రమ ముఖ్యులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఇంధన, నూతన, పునరుత్పాదక విద్యుత్ శాఖామాత్యులు ఆర్‌కె సింగ్ కీలకోపన్యాసం ఇచ్చారు. భారతదేశంలో కెనడా రాయబారి హిజ్ ఎక్స్‌లెన్సీ కామెరాన్ మాక్‌కే ప్రారంభోపన్యాసం ఇవ్వగా, కెనడాలోని ఒంటారియో ప్రభుత్వ ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, వాణిజ్య శాఖామాత్యులు విక్టర్‌ఫిడెలీ, కెనడాలో భారత రాయబారి హిజ్ ఎక్స్‌లెన్సీ సంజయ్ వర్మ వర్ట్యువల్‌గా మాట్లాడారు.
కెనడియన్ కంపెనీలు భారతీయ పునరుత్పాదక శక్తి (ఆర్‌ఈ) రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను గురించి వెల్లడిస్తూ ఈ అండ్ వై గ్లోబల్ అధ్యయనం ప్రస్తావించారు. ఈ రంగంలో సాంకేతికత పరంగా ఇండియా అభివృద్ధి చెందిన రెండవ దేశమన్నారు. అంతేకాదు, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్ధలలో క్లైమెట్ యాక్షన్ పరంగా ఇండియా ఉందన్నారు.
తెలంగాణా రాష్ట్ర ఐటీఈ అండ్ సీ, ఐ అండ్ సీ శాఖల ముఖ్యకార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ మాట్లాడుతూ ఒంటారియో ప్రభుత్వంతో పాటుగా తెలంగాణా ప్రభుత్వం నడుమ ఓ అవగాహన ఒప్పందం ఐసీబీసీ వార్షిక సదస్సులో జరిగిందన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, స్టార్టప్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో రెండు దేశాల నడుమ మరింత సహకారం కోసం పిలుపునిచ్చామంటూ మినిస్టర్ ఫిడెలీ కూడా పాల్గొనగా ఫైర్ సైడ్ చాట్ నిర్వహించామన్నారు. అంతకుముందు గౌరవనీయ తెలంగాణా ఐటీ శాఖామాత్యులు కెటీ రామారావు వర్ట్యువల్‌గా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సదస్సులో పాల్గొన్న ఇతర ముఖ్యులలో కెనడాలో పూర్వ భారత రాయబారి శ్రీ అజయ్ బిసారియా; ఇండియా లో కెనడా హై కమిషనర్, మంత్రి (కమర్షియల్ ఎఫైర్స్) జెన్నిఫర్ డౌబెని; భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి శాఖ జాయింట్ సెక్రటరీ నందిత గుప్తా; భారతప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో, డీఈఏ (ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ డీఐ) డైరెక్టర్ పవన్‌కుమార్ పాల్గొన్నారు.
ఈ సదస్సులో పాల్గొన్న ఇతర ముఖ్యులలో జూబ్లియంట్ భారతీయ గ్రూప్ కో-ఛైర్మన్, ఫౌండర్ హరి భారతీయ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గ్లోబల్ హెడ్, రంజిత్ గోస్వామి తదితరులు పాల్గొన్నారు. ఐసీబీసీ సీఈఓ నదీరా హమీద్ అతిథులను స్వాగతించగా, ఐసీబీసీ అధ్యక్షుడు రాకేష్ ఏరేత్ ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేశారు.