కొద్దిరోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయి. అయితే వెండి మాత్రం తళుక్కున మెరుస్తోంది. అంతర్జాతీయంగా డాలర్ ధర పెరుగుతుండడంతో దాని ప్రభావం బంగారంపై పడిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
గోల్డ్ ధర నెమ్మదిగా దిగి వస్తోంది. గత రెండురోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధర బుధవారం కాస్త తగ్గింది. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో పదిగ్రాముల బంగారం ధర 317 రూపాయలకు పతనం అయ్యింది. గత ముగింపు 46,699తో పోలిస్తే 46,382 రూపాయలకు తగ్గింది.
అయితే వాస్తవంగా చూస్తే మాత్రం గత యేడాదితో పోలిస్తే దిగువస్థాయిలోనే కదలాడుతోందని భావిస్తున్నారు. వెండిమాత్రం తళుక్కుమని మెరుస్తోంది. బుధవారం ఒక్కరోజే 2,328 రూపాయలు పెరిగిన వెండి.. 70,200 రూపాయలకు చేరువైంది. అయితే గత యేడాది 71 వేలకు చేరిన కిలో వెండి ప్రస్తుతం 70 వేల వద్ద వుంది. గత యేడాదితో పోలిస్తే బాగా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.