దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలపై జనాలు గగ్గోలు పెడుతున్నారు. దానికితోడు వంట గ్యాస్ ధరను కూడా కేవలం నెల రోజుల్లో ఏకంగా వంద రూపాయల మేరకు పెంచేశారు. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదలపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది.
ఈ పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరోసారి స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని, అయితే మార్చి లేదా ఏప్రిల్‌లో తగ్గే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
ముడి చమురు ఉత్పత్తి చేసే దేశాలు లాభాల కోసం ఉత్పత్తిని తగ్గించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రధాన్ తెలిపారు. ఉత్పత్తిని పెంచాలని రష్యా, ఖతార్, కువైట్‌లాంటి దేశాలపై తాను ఒత్తిడి తెస్తున్నట్లు వివరించారు.
ఉత్పత్తి పెరిగినప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర తగ్గుతుందని, ఆ ప్రభావం చివరిగా పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ఉంటుందని చెప్పారు. గతేడాది ఏప్రిల్‌లో ఈ దేశాలు ఉత్పత్తిని తగ్గించాయి. ఇప్పుడు కొవిడ్ మునుపటి పరిస్థితులకు డిమాండ్ పెరిగినా.. ఉత్పత్తి మాత్రం పెంచడం లేదు అందుకే ధరలు ఈ స్థాయిలో ఉన్నాయి అని ప్రధాన్ వివరించారు.