కొత్త లేబర్ కోడ్ అమలులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే.. కంపెనీలు వారానికి 4 రోజులు మాత్రమే ఉద్యోగులతో పని చేయించుకునే వీలు కలుగుతుంది. అయితే వారానికి మొత్తం పని గంటలు మాత్రం 48గానే ఉండనున్నాయి.
ఈ లెక్కన ఒకవేళ కంపెనీలు నాలుగు రోజులు పని, మూడు రోజులు పెయిడ్ లీవ్స్ ఇవ్వాలని అనుకుంటే..ఆ నాలుగు రోజుల్లో రోజుకు 12 గంటల పాటు ఉద్యోగులతో పని చేయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఉద్యోగుల అనుమతితోనే అని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు.
ఈ ఏడాది జూన్ నాటికి అసంఘటిత రంగ కార్మికులు రిజిస్టర్ చేసుకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం ఓ వెబ్ పోర్టల్ ప్రారంభించనుంది కార్మిక మంత్రిత్వ శాఖ. సాధ్యమైనంత త్వరగా వేతన కోడ్, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య, పని పరిస్థితులు, సామాజిక భద్రత కోడ్‌లను తీసుకురానుందని అపూర్వ చంద్ర తెలిపారు.
వారానికి ఎన్ని రోజులు పని అన్న విషయంలో తాము ఎవరినీ ఒత్తిడి చేయడం లేదని అపూర్వ చంద్ర చెప్పారు. కంపెనీలకు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం రెండు ఆప్షన్లు అందిస్తుందని.. వారంలో నాలుగు రోజులు (రోజుకు 12 గంటలు) పని చేయాలా? లేదంటే వారంలో ఐదు రోజులు లేదా ఆరు రోజులు పని చేయాలా? అనేది పూర్తిగా ఉద్యోగులు, కంపెనీల ఇష్టమని తెలిపారు. కంపెనీలు, ఉద్యోగులు కచ్చితంగా ఒక ఆప్షన్ ఎంచుకోవలసి ఉంటుందని..వారు ఏ ఆప్షన్ అయినా ఎంచుకోవచ్చని తెలిపారు.
కొత్త రూల్ అమలులోకి వచ్చిన తర్వాత కంపెనీలు 4 రోజుల, 5 రోజుల, 6 రోజుల పని దినాల కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు . ఈ కొత్త కోడ్ వల్ల కంపెనీలు, ఉద్యోగులకు పని చేసే రోజుల్లో కాస్త వెసులుబాటు కలుగుతుందని అపూర్వ చంద్ర చెప్పారు.
ఈ కొత్త కోడ్ ముసాయిదా నిబంధనలు చివరి దశలో ఉన్నాయని, చాలా వరకూ రాష్ట్రాలు కూడా తమ సొంత నిబంధనలు రూపొందించే ప్రక్రియలో ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ఉచిత మెడికల్ చెకప్స్ కూడా ఈ కొత్త లేబర్ కోడ్‌లో ఉంటాయి.