భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్‌ఎల్) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'బీఎస్‌ఎన్‌ఎల్ ఆజాదీ కా ప్లాన్' పేరిట దీన్ని లాంచ్ చేసింది. ఇందులోభాగంగా కేవలం ఒక్క రూపాయికే 30 రోజుల అపరిమిత సేవలను అందిస్తుంది. ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు మాత్రమే! ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ తన సామాజిక మాధ్యమమైన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ ప్లాన్‌లో భాగంగా రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రోజుకు 2జీబీ డేటాను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది. సిమ్ కూడా ఫ్రీ. ఈ ఆఫర్ ఆగస్టు ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆసక్తి గల వినియోగదారులు ఈ ఆఫర్ కోసం సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ)కు లేదా రిటైలర్‌ను సందర్శించొచ్చు. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, 4జీ సేవలను విస్తరించడమే లక్ష్యంగా సంస్థ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.