Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెట్రోల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం.. పన్నుల్లో బాదుడేబాదుడు...

Advertiesment
పెట్రోల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం.. పన్నుల్లో బాదుడేబాదుడు...
, సోమవారం, 25 జనవరి 2021 (09:46 IST)
పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరికొత్త రికార్డును నెలకొల్పింది. దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దేశంలోనూ మూడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, రాజస్థాన్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 
 
దక్షిణ భారతంలో మాత్రం పెట్రోలు, డీజిల్‌ అమ్మకాల్లో ప్రజలపై అత్యధిక పన్నులు మోపే రాష్ట్రంగా ఏపీ దూసుకుపోతోంది. దీంతో ప్రతిపక్షంలో ఉండగా ఏపీలోనే అత్యధిక ధరలు అంటూ జగన్‌ ఊదరగొట్టిన ప్రసంగాలు ఇప్పుడు ట్రెండింగ్‌ అవుతున్నాయి. అప్పుడు అలా మాట్లాడి, ఇప్పుడు జగన్‌ చేసిందేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 
 
రాష్ట్రంలో పెట్రోలుపై 31 శాతం, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్‌ ఉంది. కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్‌ సుంకం కేంద్రానికి వెళితే, వ్యాట్‌ పూర్తిగా రాష్ట్రాలకు దక్కుతుంది. ఇంధన ధరలు పెరుగుతూ వెళితే, అందుకు అనుగుణంగా వ్యాట్‌ భారమూ ప్రజలపై పెరుగుతుంది. ఇది చాలదు అన్నట్టు పెట్రోలు, డీజిల్‌ ఒక్కో లీటరుపై రూ.4 చొప్పున అదనపు వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. 
 
తెలుగుదేశం హయాంలో ఇది రూ.2గా ఉంటే, అధికారంలోకి వచ్చిరాగానే జగన్‌ ప్రభుత్వం దానికి అదనంగా మరో రూ.2 భారం జనంపై వేసింది. ఈ మధ్యకాలంలో రోడ్ల అభివృద్ధి పన్ను పేరుతో పెట్రోలు, డీజిల్‌పై కొత్త పన్నును సృష్టించి మరో రూపాయి భారం వేసింది. అయితే ఆ రూపాయిపై తిరిగి వ్యాట్‌ వేయడంతో అది పెట్రోలుపై రూ.1.31, డీజిల్‌పై రూ.1.22గా మారింది. దీంతో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కో లీటరు పెట్రోలుపై రూ.25, డీజిల్‌పై రూ.20 ఆదాయం వస్తోంది. 
 
అంతేకాదండోయ్.. ఏపీలో విధిస్తున్న పన్నుల భారం పక్క రాష్ట్రాల ఇంధన వ్యాపారులకు లాభసాటిగా మారింది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న బంకుల వద్ద ఏపీకి, అక్కడి ధరలకు ఎంత తేడా ఉందో ఫ్లెక్సీలు కట్టి మరీ ప్రదర్శిస్తున్నారు. 'ఏపీలోకి వెళ్తే మీ జేబు ఖాళీ అవుతుంది' అని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. మొత్తంమీద.. సీఎం జగన్ ప్రభుత్వం ఇంధన ధరల్లో సరికొత్త రికార్డు నెలకొల్పిందని వాహనదారులు వాపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్యోతిష్య పండితులారా తప్పును సరిదిద్దుకోండి: 12 రాశుల్లో తిరిగేది భూమి.. సూర్యుడు కాదు