Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల స్మార్ట్ తెలివి.. ఏం చేస్తున్నారో తెలిస్తే షాకే...?

స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల స్మార్ట్ తెలివి.. ఏం చేస్తున్నారో తెలిస్తే షాకే...?
, బుధవారం, 10 అక్టోబరు 2018 (20:31 IST)
నేటి యువత ఏయేడాదికాయేడాది ఫోన్‌ మార్చేస్తోంది. మార్కెట్‌లోకి వచ్చే కొత్త మోడల్‌ను సొంతం చేసుకుని వాడుతున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదు. అయితే… ధరల పెరుగుదల వినియోగదారులకు భారంగా మారనుంది. స్మార్ట్‌ ఫోన్ల ధర పెరగడానికి బలమైన కారణాలున్నాయి. రూపాయి విలువ పడిపోయేకొద్దీ మొబైల్స్‌ ధర పెరగడం అనివార్యంగా కనిపిస్తోంది. ఇంతకీ రూపాయి విలువకు మొబైల్‌ ధరలకు లింకేమిటి?
 
సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలకు 125 కోట్ల జనాభా ఉన్న మన దేశం పెద్ద మార్కెట్‌. అందుకే ఈ కంపెనీలు భారతదేశంలోనే పరిశ్రమలు స్థాపించి, ఇక్కడే ఫోన్లను తయారుచేస్తున్నాయి. అయితే…. సెల్‌ఫోన్‌ మొత్తం ఇక్కడ తయారు కాదు. అక్కడ అసెంబ్లింగ్‌ మాత్రమే జరుగుతుంది. విడి భాగాలన్నీ విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. 90 శాతం విడిభాగాలు విదేశాల నుంచే వస్తున్నాయట. ఇలా విదేశాల నుంచి తెచ్చుకోవడం వల్లే దేశంలో స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి.
 
డాలరుతో పోల్చితే రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతోంది. ప్రస్తుతం రూ.73.34కు చేరుకుంది. అంటే ఒక డాలరు విలువైన విడిభాగాలు దిగుమతి చేసుకోవాలంటే రూ.73.34 చెల్లించాలన్నమాట. అదే ఈ ఏడాది జనవరిలో రూపాయి విలువ రూ.63.88గా ఉండేది. అంటే అప్పట్లో ఒక డాలరు విలువైన దిగుమతులకు రూ.63.88 చెల్లిస్తే సరిపోయేది. ఈ 10 నెలల కాలంలోనే డాలరుపై దాదాపు రూ.10 భారం పడింది. దీంతో దిగుమతులపై ఆధారపడిన సెల్‌ కంపెనీలు బెంబేలెత్తుతున్నాయి.
 
రూపాయి విలువ పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం…. దిగుమతి చేసుకునే వస్తువులపై పడుతుంది. పెట్రోలు, డీజిల్‌ మన దేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. రూపాయి విలువ తగ్గితే (డాలర్‌ విలువ పెరిగితే…) మన దేశంలో పెట్రో ధరలు పెరిగిపోతాయి. అదే పరిస్థితి సెల్‌ఫోన్లకూ వచ్చింది.
 
ధరలను తట్టుకోడానికి సెల్‌ కంపెనీలు కొత్తదారులు వెతుకుతున్నాయి. పాత ఫోన్ల ధరలు పెంచడానికి వీల్లేదు. ఎందుకంటే వినియోగదారుల్లో వ్యతిరేకత వస్తుంది. సాధారణంగా సెల్‌ఫోన్ల ధరలు… ఒక మోడల్‌ విడుదలైనప్పటికంటే కొంత కాలానికి దాని ధర తగ్గుతుంది. అందుకే… పాతవాటిపై ధరలు పెంచడం కంటే కొత్త మోడళ్లను విడుదల చేసి, లాభసాటి అయిన ధర నిర్ణయించడంపైనే కంపెనీలు దృష్టి పెట్టాయట. జూన్‌ నుంచి ఇప్పటి దాకా 250 కొత్త మోడళ్లు మార్కెట్‌లోకి వచ్చాయట. గత ఏడాది ఇదే కాలంలో 200 మోడళ్లు మాత్రమే వచ్చాయట.
 
ఏదేమైనా ఈ అనుభవం చెబుతున్నది ఒక్కటే. దిగుమతులపై ఆధారపడటం ఎప్పటికైనా ప్రమాదమే. ఇక్కడి ముడిసరుకులు వినియోగించి, ఇక్కడే విడి భాగాలూ తయారుచేయగలిగితే…. అంతర్జాతీయంగా డాలరు-రూపాయిలో వచ్చే మార్పుల ప్రభావం పెద్దగా ఉండదు. ఇలా కాకుండా ఇప్పటిలాగే విడి భాగాలు దిగుమతి చేసుకుంటూపోతే… స్మార్ట్‌ఫోన్‌ హార్డ్‌ఫోన్‌గా మారిపోవడం ఖాయం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరు కలెక్టర్ కోన శశిధర్‌కు ముఖ్యమంత్రి ఘన సన్మానం.. ఎందుకు?