'ఆధార్'కు శాసన హోదా... బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టనున్న కేంద్రం

మంగళవారం, 1 మార్చి 2016 (09:34 IST)
ఆధార్ కార్డుకు చట్టబద్ధత కల్పించనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఓ బిల్లును ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రాయితీలను లక్షిత లబ్ధిదారులకు నేరుగా చేరవేసేందుకు వీలుగా ఈ తరహా కీలక నిర్ణయం తీసుకుంది. 
 
అంటే.. ఆధార్‌ నంబరుకు శాసన హోదా కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నింటినీ ఆధార్‌ అనుసంధానం ద్వారానే లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం 'ఆధార్'కు శాసనహోదా కల్పిస్తూ ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లోనే రెండు రోజుల్లో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆధార్‌కు చట్టబద్ధత కల్పించినప్పటికీ పౌరసత్వ, స్థానిక హక్కులు మాత్రం దీంతో ముడిపడి ఉండవని స్పష్టంచేశారు. 
 
వాస్తవానికి కేంద్ర పథకాల నుంచి లబ్ధి పొందాలంటే ఆధార్‌ను తప్పనిసరి చేయడానికి ప్రభుత్వం గతంలోనే యత్నించింది. అయితే, 'ఆధార్'’ చట్టబద్ధత, గోప్యతపై సుప్రీంకోర్టు పలు సంశయాలు లేవనెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి 'ఆధార్' తప్పనిసరేమీ కాదని... అది కేవలం స్వచ్ఛంద పథకమని పేర్కొంటూ గతేడాది అక్టోబరులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి