కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం లోక్‌సభలో 25 ఏళ్ల తరువాత తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర సాధారణ బడ్జెట్ ప్రసంగంలో ప్రణబ్ ముఖర్జీ పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. దేశంలో మౌలిక సౌకర్యాలను విస్తృతపరుస్తామని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం గతంలో ఉద్దీపన చర్యలు ప్రకటించింది. అవసరమైన రంగాలకు ఈ ఉద్దీపన పథకాలను కొనసాగిస్తామని ప్రణబ్ పేర్కొన్నారు. జీడీపీని పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఇటీవల ఎన్నికల్లో దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును సగర్వంగా స్వీకరిస్తున్నాము. దేశ సంక్షేమం కోసం తాము చేయగలిగిందంతా చేసి చూపిస్తామని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. సమిష్టి వృద్ధితో తాము సాధించిన బలమైన తీర్పు ఇదన్నారు. యువ భారతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు సాయపడతామన్నారు.
9 శాతం వృద్ధి రేటు, ఏడాది 12 మిలియన్ ఉద్యోగాలు సృష్టించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 2014నాటికి దారద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్యను సగానికి తగ్గించాలనుకుంటున్నట్లు చెప్పారు. అదే సమయానికి మౌలిక పెట్టుబడులను 9 శాతానికి చేరుస్తామన్నారు. ఎగుమతుల రంగంలో పునరుత్తేజం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రాథమిక ఆరోగ్య సేవలను పటిష్టపరుస్తామన్నారు. సమిష్టి వృద్ధిని మరింత విస్తరిస్తామన్నారు. నాలుగు శాతం వ్యవసాయాభివృద్ధికి పాటుపడతామన్నారు. బ్యాంకులను, బీమా సంస్థలను ప్రైవేట్ పరం చేయబోమని తెలిపారు. స్థూల దేశీయోత్పత్తిని తిరిగి 9 శాతానికి చేర్చడం ప్రస్తుతం ప్రభుత్వ ముందున్న సవాలని తెలిపారు.
సమిష్టి అభివృద్ధి ప్రక్రియను మరింత లోతుల్లోకి తీసుకెళ్లడం తమ ముందున్న ఇతర సవాళ్లలో ఒకటని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. గత ఐదేళ్లపాటు వృద్ధి రేటుకు ప్రైవేట్ పెట్టుబడులు వెన్నుముకగా నిలిచాయి. భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు గత పదేళ్లలో పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు సేవల రంగం జీడీపీలో 50 శాతం వాటా కలిగివుంది.
మౌలిక సౌకర్యాల అభివృద్ధిపై దృష్టిసారిస్తూ, ఈ రంగంలో పెట్టుబడులను 2014నాటికి 9 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకార చర్యలతోనే వృద్ధి రేటును ముందుకుతీసుకెళ్లగలం. స్థూల జాతీయోత్పత్తి పతనం అవడం వలనే ఉద్యోగాల వృద్ధి రేటు దెబ్బతింది.
భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో అనుసంధానం చేయడం వలన కొత్త అవకాశాలు, కొత్త సవాళ్లు వచ్చాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు ఉద్దీపన పథకాలు ప్రకటించింది. ఉత్పాదక రంగం అవసరాలను తీర్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ద్రవ్య నియంత్రణ చర్యలు చేపట్టింది.
ఉద్దీపన చర్యల కారణంగా 08-09లో ఆర్థిక లోటు 6.2 శాతానికి పెరిగింది. గత ఏడాది 6.7 శాతం స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు సాధించామని ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఇప్పటికీ కొనసాగుతోందని ప్రణబ్ పేర్కొన్నారు.
మౌలిక సౌకర్యాల కంపెనీలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఐఎఫ్ఎఫ్‌సీఎల్‌ను ఏర్పాటు చేసింది. ఆర్థిక ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం పొందేందుకు ఉపయోగపడ్డాయని ప్రణబ్ తెలిపారు.