Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రతనాల జాడను పట్టి చూపిన 'రాయలసీమ వైభవం'

Advertiesment
రతనాల జాడను పట్టి చూపిన 'రాయలసీమ వైభవం'
, శనివారం, 20 సెప్టెంబరు 2008 (19:50 IST)
అంగళ్ల రతనాలు అమ్మినారట ఇచట.. అంటూ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రాయలసీమ అనుభవించిన సంపదలను గురించి కవులు వర్ణించడం అందరికీ తెలుసు. అయితే గతమెంతో ఘనకీర్తి కలవాడా అంటూ చరిత్రను పారాయణం చేయడం కాకుండా, ఆ ఘనకీర్తి ఏమిటో ప్రతి కొత్త తరానికీ తెలియాలి. సమిష్టిగా జరగాల్సిన ఈ బృహత్ కృషిలో పాలుపంచుకునే వారు.. అందరి కృషిని సమన్వయించి సారథ్యం వహించగలిగిన వారు ఇప్పుడు చాలా అవసరం.

ఒకనాడు మెరిసిన రాయలసీమ వైభవాన్ని గురించి టముకు వాయించడం కాకుండా దాని విశేషాన్ని పుస్తక రూపంలోకి తీసుకువచ్చి, సీమ ఘనచరిత్రను జనంలోకి తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేసిన వారు తవ్వా ఓబుల్ రెడ్డి. 'రాయలసీమ వైభవం' అనే పేరుతో ఆయన ఇటీవల తీసుకువచ్చిన అరుదైన పుస్తకం సీమలోని నాలుగు జిల్లాల -కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం-లోని ప్రకృతి వనరులు, పుణ్య క్షేత్రాలు, సీమ గడ్డపై జన్మించిన మహనీయులు ఇలా అన్నింటినీ పరిచయం చేస్తూ.. సీమ సంస్కృతి, సాహిత్యం, కళల గురించి ఓబుల్ రెడ్డి విజ్ఞులతో మంచి వ్యాసాలు రాయించారు.

ఈ పుస్తకంలో.. నాటి మొల్ల, అన్నమయ్యలు మొదలుకుని, మొన్నటి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు నుంచి నిన్నటి తరానికి చెందిన తిరుమల రామచంద్ర, మధురాంతకం రాజారాం, రాచమల్లు రామచంద్రారెడ్డి వరకు సీమ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఎందరో పండితోత్తములను పరిచయం చేశారు. వసుచరిత్ర, మనుచరిత్ర వంటి ఎన్నో మహాకావ్యాలు కవుల ఘంటాలనుంచి జాలువారింది కూడా ఇక్కడే అని ఈ పుస్తకంలో అందరికీ గుర్తు చేశారు.

మరోవైపున నాటకరంగం అనగానే గుర్తుకు వచ్చే బళ్లారి రాఘవ నుంచి.. తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయులైన కెవి రెడ్డి, బిఎన్ రెడ్డి లాంటి మహనీయుల వరకు మాత్రమే గాక, రాజకీయ రంగంలో ముఖ్యమంత్రులైన వారి నుంచి, రాష్ట్రపతులైన వారి దాకా పలువురు దిగ్ధంతుల వివరాలు ఈ పుస్తకంలో తెలియపర్చారు.

అన్నిటికన్నా మించి ఈ పుస్తకం ముందుమాటలో సీమ ప్రజల స్వభావాన్ని పట్టి చూపించే మెరుపు వాక్యాలను పొందుపర్చటం విశేషం. ....మాట కటువైనా మనసు వెన్న.. ఆప్యాయతలూ అనురాగాలూ రాయలసీమ ప్రజల నైజాలు. అన్ని మతాల ప్రజలు ఐకమత్యంగా జీవించడం ఇక్కడ విశిష్టత...

ఈ పుస్తకం చదివితే పై వాక్యాలు అక్షర సత్యాలని ఎవ్వరైనా ఒప్పుకుంటారు మరి.

రాయలసీమ వైభవం
సంపాదకులు తవ్వా ఓబుల్ రెడ్డి
పుటలు 130. వెల: రూ. 150
ప్రతులకు
అన్ని విశాలాంధ్ర బ్రాంచీలు.

Share this Story:

Follow Webdunia telugu