Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిన్ లాడెన్ కవితల్లోనూ ఉగ్రవాదమే..

బిన్ లాడెన్ కవితల్లోనూ ఉగ్రవాదమే..
, సోమవారం, 22 సెప్టెంబరు 2008 (17:38 IST)
FileFILE
అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్ కవిత్వంలోనూ ఉగ్రవాదమే ప్రతిబింబిస్తోందనే ఆసక్తికరమైన విషయం తాజాగా బయటపడింది. అమెరికాకు వ్యతిరేకంగా ఉగ్రవాద మార్గం పట్టకముందు బిన్ లాడెన్ కవిత్వం రాసేవాడన్న విషయం ఇప్పుడు యూరప్‌లో సంచలన వార్తగా మారింది.

గతంలో అరబిక్ భాషలో బిన్ లాడెన్ రాసిన కవితల ఆడియో టేపులను కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ ఫ్లాగ్ మిల్లర్ పుస్తక రూపంలోకి తీసుకువచ్చారు. కాలిఫోర్నియా యూనివర్శిటీలో అరబిక్ భాషా సాహిత్యాలను బోధిస్తున్న ప్రొఫెసర్ మిల్లర్ వచ్చేవారం లాడెన్ కవితా సంపుటిని విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు.
మార్క్స్ నుంచి మావో దాకా కవులే...
  గత రెండు శతాబ్దాల కాలంలో ప్రపంచంలో నూతన సామాజిక విప్లవాలకు నాయకత్వం వహించిన పలువురు సైద్ధాంతికవేత్తలు కవిత్వాన్ని తమ సిద్ధాతం ప్రచారానికి ఉపయోగించుకున్నవారే. మార్క్స్, మావో, చౌ ఎన్‌లై, హోచిమిన్ వంటి వారు కవులుగానూ సుప్రసిద్ధులే....      


ఈ సందర్భంగా మిల్లర్ మాట్లాడుతూ బిన్ లాడెన్ అరబిక్ భాషలో ఛందస్సు, ప్రాసల ఎంపికలో చెయ్యి తిరిగిన కవిగా ప్రస్తుతించారు. అందుకనే అతని కవితలను పాప్ సంగీతం మాదిరిగా ఆడియో టేపుల్లో రికార్డు చేసేందుకు ఇష్టపడేవారని మిల్లర్ పేర్కొన్నారు.

అమెరికా నేర పరిశోధక సంస్థ ఎఫ్‌బిఐ అనువాదకులు లాడెన్ కవితలను పరిశీలిస్తున్నప్పుడు నాలుగేళ్లకు ముందు మొదటిసారిగా లాడెన్ కవితలను తాను విన్నానని మిల్లర్ చెప్పారు. ఉగ్రవాద బాట చేపట్టకముందు పౌర జీవితంలో పెళ్లి విందులు తదితర సందర్భాల్లో లాడెన్ కవితా పఠనంతో అందరినీ ఆకట్టుకునేవాడని తెలిపారు.

ఇలా పెళ్లివిందుల సమయాల్లో లాడెన్ పాడిన కవితలను కొందరు అప్పట్లో ఆడియోలలో రికార్డ్ చేశారని మిల్లర్ పేర్కొన్నారు. అతడి కవితల్లో పర్వతాలను ప్రతీకలుగా ఉపయోగించే ధోరణి ఎక్కువగా ఉంటుందని, విప్లవాత్మక ధోరణితో కవితలు నడిచేవని చెప్పారు. ఉగ్రవాదంలో లాడెన్ కవిత్వం పాత్రపై తన పరిశీలనను మిల్లర్ త్వరలో పుస్తకంగా తీసుకు రానున్నట్లుగా వెల్లడించారు.

ఇంతవరకు విప్లవాలకు, తిరుగుబాట్లకు నాయకత్వం వహించిన సుప్రసిద్ధ నేతలందరూ కవులుగా, రచయితలుగా చరిత్రలో పేరు గాంచినవారే.. బిన్ లాడెన్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కానైతే విషయం కాస్త లేటుగా తెలిసింది అంతే..

Share this Story:

Follow Webdunia telugu