Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరవింద్‌లో రచనాసక్తికి ఆస్ట్రేలియా తోడ్పాటు

అరవింద్‌లో రచనాసక్తికి ఆస్ట్రేలియా తోడ్పాటు
, శుక్రవారం, 17 అక్టోబరు 2008 (18:42 IST)
సాహితీ లోకంలో సంచలనాత్మక విజయం సాధించిన ది వైట్ టైగర్ నవలా రచయిత అడిగా అరవింద్‌కు 2008 బుకర్ ప్రైజ్ అవార్డు లభించింది. ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ గెలుచుకున్న ఐదవ భారతీయ రచయితగా అరవింద్ పేరుకెక్కారు. అయితే ఆస్ట్రేలియాలో తను పెరగిన నేపథ్యమే తనలో సమిష్టి ప్రపంచ దృక్పధం ఏర్పడటానికి కారణమైందని అరవింద్ చెప్పారు. ఇదే తన రచనా కృషికి పునాదిగా పనిచేసిందని అన్నారు.

33 ఏళ్ల అరవింద్‌కు ఆస్ట్రేలియా, భారత్‌లలో ద్వంద్వ పౌరసత్వం ఉంది. తన మొట్టమొదటి నవలకే మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు దక్కడం ఒక విశేషం కాగా, భారతీయ కుల వ్యవస్థ పునాదులను ఈ నవల పరామర్శించడం మరో విశేషం. న్యూఢిల్లీలోని ఒక భారతీయ రిక్షా కార్మికుడి జీవన పోరాటాన్ని ఈ నవల చిత్రించింది.

భారత్‌లో చెన్నయ్‌లో జన్మించిన అరవింద్ తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో అయిదారేళ్లు గడిపారు. అక్కడ జేమ్స రూస్ అగ్రికల్చరల్ హైస్కూల్‌లో చేరారు. ఈ స్కూలులో గడిపిన అనుభవమే అతడి రచనా కృషిపై అపార ప్రభావం చూపింది. భారత్ తిరిగి రావడానికి ముందు వివిధ ప్రాంతాల్లో తాను గడిపిన జీవితం కూడా తనలో రచయితను పాక్షికంగా తీర్చిదిద్దిందని చెప్పారు.

ఆస్ట్రేలియా, న్యూయార్క్, ఇంగ్లండ్‌లలో కొద్ది కాలం గడిపానని, చాలా సంవత్సరాలు ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నానని అరవింద్ చెప్పారు. ఈ మూడింటిలో కనీసం రెండు ప్రదేశాలు సమానావకాశాల సిద్ధాంతానికి (ఈగలిటేరియనిజం) ప్రాధాన్యమిస్తాయని తెలిపారు. ఇతరుల సహాయం లేకుండా తన పని తాను చేసుకోవడం అనేది తనకు సిడ్నీ, న్యూయార్క్‌లలో అలవడిందని పేర్కొన్నారు. సాధారణంగా సేవకులు చేసే పనులను తనకు తానే చేసుకోవలసి రావడం తనలో ఏ చికాకునూ కలిగించలేదని అరవింద్ చెప్పారు.

తన జీవితంలో ఎంతో వైవిధ్యపూరితమైన వ్యక్తులను చూశానని, భారత్‌లో మధ్యతరగతి వ్యక్తిగా తానిప్పుడు చెప్పుకోలేనని అరవింద్ అభిప్రాయపడ్డారు. అయితే తన చుట్టూ సేవకులు ఉండటం చూస్తున్నానని, వారెలా ఉంటున్నారు అనే ఆసక్తి తనలో ఏర్పడిందని చెప్పారు. తన విద్యాజీవితమంతా సాపేక్షికంగా వర్గాలు లేని ప్రదేశాల్లోనే గడిపానని, బ్రిటన్‌లో ఉంటున్నప్పుడు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఉన్నానని అరవింద్ చెప్పారు. ఈ సందర్భంలో అది వర్గ రహిత ప్రదేశమని, దీన్నే తాను భారత్‌కు పట్టుకొచ్చానని చెప్పారు.

రాయడానికి తనవద్ద చాలా ముఖ్య విషయాలు ఉన్నప్పటికీ నేటి ప్రపంచంలో వర్గాలు, ధనికులకు పేదలకు మధ్య అగాధపూరితమైన వ్యత్యాసాలు ఉంటున్నాయని వాటిగురించి రాయవలసింది చాలానే ఉందని అరవింద్ చెప్పారు. చాలామంది ప్రజలు సాహిత్యాన్ని గురించి పెద్దగా పట్టించుకోరుకానీ, నేటి ప్రపంచంలో సాహిత్యం చాలా అవసరమని పేర్కొన్నారు. ఎందుకంటే ఉగ్రవాదం, అస్థిరత వంటి చాలా అంశాలు దీనితో ముడిపడి ఉన్నాయని చెప్పారు.

అందుకే వర్గం అనేది తన మనస్సులో నిలిచిపోయిందని, దీనిగురించే తాను రాయబోతున్నానని చెప్పారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న అరవింద్ బుకర్ ప్రైజ్ అవార్డును న్యూఢిల్లీ ప్రజలకు అంకితం చేస్తున్నట్లుగా చెప్పారు. ఎందుకంటే 300 ఏళ్ల క్రితం ఇది భూమ్మీద అతి ముఖ్యమైన నగరంగా ఉండేదని ఈ నగరానికి ఆ స్థాయి తిరిగి వస్తుందని అరవింద్ చెప్పారు.

భారత్‌లో చాలామంది పేద ప్రజలకు బతికేందుకు రెండే రెండు మార్గాలున్నాయనేది పచ్చి నిజమని అరవింద్ వ్యాఖ్యానించారు. నేరాలు చేయడం లేదా రాజకీయాల్లో ప్రవేశించడం. రాజకీయాలు సైతం నేరానికి మరోరూపంగా ఉంటున్నాయని చెప్పారు. అట్టడుగు శ్రేణిలోని పేద వర్గాలు ప్రజలకు కూడా మధ్య తరగతి వర్గానికి మల్లే అదేవిధమైన జీవన ఆకాంక్షలు ఉన్నాయని అరవింద్ చెప్పారు.

మంచి బతుకు బతకాలని, వ్యాపారవేత్త కావాలని, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించాలని మధ్యతరగతి ఆశిస్తున్న ఆకాంక్షలు పేదవారికి కూడా ఉన్నాయి. పిల్లలను బడిలో చేర్చించడం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి కలలు పేదవారికీ ఉన్నాయని చెప్పారు. వీటిని సాధించాలంటే దేశంలో నేరాలు చేయడం లేదా రాజకీయాల్లో పాల్గొనడం అనే రెండు మార్గాలే ఉంటున్నాయని అరవింద్ చెప్పారు.

భారత్‌లో ఈ విధమైన ధనిక పేద వ్యత్యాసాలు చాలా ఉన్నప్పటికీ తన పుస్తకం మాత్రం భారతీయ సమాజంపై వ్యాఖ్యానం మాత్రం కాదని అరవింద్ చెప్పారు. ఉన్న పరిస్థితికి నాటకీయ రూపం ఇవ్వడం, దాన్ని సాహిత్యంలోకి తీసుకురావడం మాత్రమే తాను చేశానని తెలిపారు. ఆవిధంగా తన ది వైట్ టైగర్ నవల సరదాగా ఉంటూ పాఠకులను అలరిస్తుందని అన్నారు.

ఒక ప్రతినాయకుడి పట్ల పాఠకుడు సానుభూతి తెల్పడం అనే అసాధారణ, కష్టభూయిష్టమైన లక్ష్యాన్ని ఈ నవల ఎత్తుకుంది. కలవరపెడుతున్న సామాజిక అంశాలను ప్రస్తావిస్తూనే, ప్రపంచ పరిణామాలను ఈ నవల అద్భుతమైన హాస్యరీతిలో వర్ణించడంలో విజయం సాధించిందని విమర్శకుల భావన.

Share this Story:

Follow Webdunia telugu